పల్లె వెలుగు.. కనిపించక రెండేళ్లు!
వరంగల్ ఆర్టీసీ రీజయన్ పరిధిలో బస్సులు నడవని గ్రామాలు అనేకం ఉన్నాయి. కొవిడ్ కారణంగా రోడ్డు రవాణా శాఖ బస్సులు నిలిపి వేసి రెండేళ్లు గడుస్తున్నా అనేక గ్రామాలకు ఆయా సర్వీసులను పునరుద్ధరించడం లేదు.
పునరుద్ధరించాలని కోరుతున్న అనేక గ్రామాలు
ఈనాడు, వరంగల్ - శివనగర్, వరంగల్ కలెక్టరేట్, జులైవాడ, ధర్మసాగర్, న్యూస్‌టుడే
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి కరోనాకన్నా ముందు మహబూబాబాద్ డిపో బస్సు నడిచేది. లాక్‌డౌన్ నుంచి ఈ ఊరికి సర్వీసు నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఈ గ్రామ ప్రజలు మహబూబాబాద్ డిపోకు వెళ్లి మళ్లీ బస్సు వేయాలని కోరినా ఫలితం శూన్యం. నెక్కొండ మండల కేంద్రానికి రావాలంటే ఈ ఊరి వాళ్లకు ఆటోలే దిక్కు. బస్సుతో పోలిస్తే ఆటో ఛార్జీలు ఎక్కువ.
తమ ఊరికి బస్సును పునరుద్ధరించాలని ప్రజలు వినతి పత్రాలు ఇచ్చినా డిపో మేనేజర్లు స్పందించడం లేదు. బస్సులు లేకపోవడంతో ఆటో వాళ్లు ఇష్టారీతిన ఛార్జీలను వసూలు చేస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.
బస్సులు నడిస్తే పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాసు తీసుకొని నెలవారీగా చెల్లిస్తే సరిపోతుంది. సర్వీసులు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్లాల్సి రావడం వారికి భారంగా మారుతోంది.
వరంగల్ ఆర్టీసీ రీజయన్ పరిధిలో బస్సులు నడవని గ్రామాలు అనేకం ఉన్నాయి. కొవిడ్ కారణంగా రోడ్డు రవాణా శాఖ బస్సులు నిలిపి వేసి రెండేళ్లు గడుస్తున్నా అనేక గ్రామాలకు ఆయా సర్వీసులను పునరుద్ధరించడం లేదు. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఛార్జీలతో రెండింతలు ఆటోలకు చెల్లిస్తున్నారు. పది మంది ఉంటేనే ఆటోను కదిలించే పరిస్థితి ఉండడంతో డబ్బులతో పాటు సమయం వృథా అవుతోంది.
గోపాలపురం, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట గ్రామాల గుండా బస్సును నడిపించాలని కోరుతూ ఇటీవల పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కమలాపూర్ మండలం గ్రామాల ప్రజాప్రతినిధులు. ఆటోల్లో ప్రయాణానికి రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఈ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
* మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి వరంగల్‌కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఇది తొర్రూరు నుంచి సన్నూరు ఎక్స్‌రోడ్డు, ఈదుల తండా, వెంకటేశ్వరపల్లి, సన్నూరు, రాజునాయక్ తండా, బాలాజీ తండా, ఊకల్, గట్టికల్, మైలారం, రాయపర్తి మీదుగా ఉదయాన్నే వరంగల్ వెళ్లేది. మార్కెట్కు వెళ్లే రైతులు, పనులకు వెళ్లే కార్మికులకు అనుకూలంగా ఉండేది.
* వరంగల్ జిల్లా గీసుకొండ మండలం 15వ డివిజన్ పరిధి గొర్రెకుంట, కీర్తినగర్ కాలనీకి గతంలో కాజీపేట నుంచి బస్సు నడిచేది. గతంలో రహదారి బాగా లేక, కొవిడ్ సమయంలో బస్సు నిలిచిపోయింది. ఇప్పుడు రెండు వరుసల రహదారి వేసినా బస్సు నడవడం లేదు. గరీభ్‌నగర్, కీర్తినగర్‌లలో 12వేల జనాభా ఉంటుంది. వీరికి బస్సు సౌకర్యం లేదు.
గతంలో వరంగల్ బస్టాండు నుంచి తపాలా కార్యాలయం వరంగల్ చౌరస్తా మీదుగా కాజిపేటకు, హనుమకొండ, కేయూకు సిటీ బస్సులు నడిచేవి. స్మార్ట్ రోడ్ల నిర్మాణం పేరిట గతేడాది నుంచి ఈ బస్సులను వెంకటరామ థియేటర్, కాశిబుగ్గ మీదుగా నడిపిస్తున్నారు. రహదారుల నిర్మాణం పూర్తయినా ఈ రూట్లలో బస్సులు నడవడం లేదు. దీంతో స్థానికులకు ఆటోలే దిక్కవుతున్నాయి.
* హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి కొవిడ్‌కు ముందు లోకల్ బస్సు ఉదయం, మధ్యాహ్నం ఒక ట్రిప్పు చొప్పున నడిచేది. అనంతరం నిలిపివేశారు. విద్యార్థులు, ప్రజలు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి ఇబ్బంది పడుతున్నారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల, ఎల్కుర్తి, మల్లకపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
* కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఏడాదిన్నర కిందట అంబాల మీదుగా వచ్చే బస్సును రద్దు చేయడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు బస్సులు లేక మూడు కిలోమీటర్ల కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ రీజినల్ మేనేజర్‌కు ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పరకాల, శనిగరం, గోపాల్‌పూర్, మాదన్నపేట, గూనిపర్తి గ్రామాల మీదుగా హనుమకొండకు విద్యార్థులు, వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించాలని ఇటీవల మూడు గ్రామాల సర్పంచులు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ములుగు మండలం పత్తిపల్లి, పొట్లాపూర్ మార్గంలో ఆటోలో వెళ్లేందుకు ఎక్కి కూర్చున్న ప్రయాణికులు
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ వివరాలు
మొత్తం డిపోలు - 9 మొత్తం సర్వీసులు - 984
ప్రతి రోజూ ఆదాయం - రూ.1.10 కోట్లు
బస్సులు నిత్యం ప్రయాణించే కిలోమీటర్లు - 3.84 లక్షలు
వరంగల్ రీజియన్ బస్సుల్లో నిత్యం ప్రయాణికులు - 10 లక్షలు
డీఎంకు విన్నవించాం
- దేవునూరు రాధాకృష్ణ, కీర్తినగర్ కాలనీ
గతంలో కీర్తినగర్‌కు బస్సు సౌకర్యం ఉండేది. మా దగ్గర వేలాది మంది బడి, పాఠశాలల పిల్లలు ఉన్నారు. బస్సు లేక వీరు ఇబ్బంది పడుతున్నారు గతంలో డిపో మేనేజర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చాం. మళ్లీ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఇబ్బంది పడుతున్నాం
- బానోతు చంద్రు నాయక్, బొల్లికొండ, నెక్కొండ మండలం
మా ఊరు బొల్లికొండకు గతంలో బస్సులు నడిచేవి. కరోనా తర్వాత ఆపేశారు. రోజుకు నాలుగు ట్రిప్పులు అవసరం ఉంది. మహబూబాబాద్ డిపో మేనేజర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చాం. రోడ్డు బాగా లేకపోతే మొరం పోయించి బాగు చేయించాం. అయినా బస్సు రావడం లేదు.
డిమాండు ఉంటే నడిపిస్తాం
- జె.శ్రీలత, వరంగల్ రీజనల్ మేనేజర్
ప్రజల వద్దకే ఆర్టీసీ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. మా అధికారులు గ్రామాలకు వెళ్లి అవసరాలు తెలుసుకుంటున్నారు. డిమాండు ఉన్న ప్రాంతాలకు నడిపిస్తాం. విద్యార్థులు ఉన్న అన్ని రూట్లలో బస్సులు ఇస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..