logo

అక్రమ కట్టడాల కూల్చివేతలో అవినీతి దందా..!

జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

Published : 07 Dec 2022 05:25 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జనగామ పట్టణంలో గత కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పని చేస్తోంది. కమిటీకి జనగామ ఆర్డీవో ఛైర్మన్‌గా, సభ్యులుగా జనగామ ఏసీపీ, అగ్నిమాపక శాఖ అధికారి, ఆర్‌అండ్‌బీ డీఈ ఉన్నారు. మున్సిపల్‌ పరిధిలో అక్రమ కట్టడాల ఫిర్యాదుల ప్రకారం వీరు కట్టడాలను కూల్చివేయాలి. ఇందుకు గాను స్పష్టమైన విధి విధానాలు రూపొందించారు. అయితే జనగామలో మాత్రం గత కొద్ది రోజులుగా ఈ కమిటీ పనితీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. ఛైర్మన్‌గా ఉన్న జనగామ ఆర్డీవో మధుమోహన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రజితకు మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడి జిల్లా కలెక్టర్‌ ఎదుటనే సోమవారం ప్రజావాణిలో కమిషనర్‌ రజిత బోరున విలపించడం సంచలనం కలిగించింది.

రాజకీయ అండతో..

జనగామ పట్టణంలో 2, 3, 4 వార్డుల పరిధిలో హైదరాబాద్‌, సూర్యాపేట రోడ్ల వైపు కాలనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని చెబుతున్నా అదంతా నామమాత్రంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి రాజకీయ అండ, పలుకుబడి లేని వారు ఇళ్లు నిర్మించుకుంటే నిబంధనల పేరుతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. అదే వార్డు కౌన్సిలర్ల నుంచి బడా నాయకుల పలుకుబడి ఉంటే చూసిచూడనట్లుగా వదిలేస్తున్నారని పలువురు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట 2వ వార్డు వీధి చివరలో కాలనీవాసులు చిన్న గోడ పెట్టుకున్నారు. డెడ్‌ ఎండ్‌ వద్ద ఇలా వార్డుల్లో అనేక నిర్మాణాలున్నాయి. అయితే పక్కన భవంతిని నిర్మిస్తున్న ఓ యజమాని కాలనీవాసులను బెదిరించి అధికారులకు ఫిర్యాదు చేసి ప్రహారిని తొలగించారు. ఫిర్యాదు చేసిన యజమాని తాను నిర్మిస్తున్న భవనానికి అనుమతి ఉల్లంఘించి మరో అంతస్తును నిర్మిస్తున్నా ఆర్డీవో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

జనవరి నుంచి డిసెంబర్‌ వరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాల సంఖ్య : 30


మొక్కుబడిగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రికార్డులు

 

గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని చెబుతున్నా.. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సెట్‌ బ్యాక్‌ పేరుతో నిర్మించుకున్న పలు భవనాలను మొక్కుబడిగా తొలగించి రికార్డుల్లో కూల్చివేసినట్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత భవన నిర్మాణ యజమానులు తిరిగి తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్మించుకుంటున్నారు. కమిటీలో ఛైర్మన్‌గా ఉన్న జనగామ ఆర్డీవో, మున్సిపల్‌ కింది స్థాయి సిబ్బంది తప్ప ఇతర సభ్యులు, మున్సిపల్‌ టీపీవో కూల్చివేతల్లో కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చివేతలను మున్సిపల్‌ కమిషనర్‌కు ఆర్డీవో చెప్పడం లేదని, అంతా తానై వ్యవహరిస్తున్నారని కమిషనర్‌ రజిత ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో ఇద్దరికి బేధాభిప్రాయాలు వచ్చాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మొత్తం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు పాల్గొనాల్సి ఉంది. ప్రతి నెలా పురోగతి వివరాలు చెప్పాలనే నిబంధనలు ఉన్నప్పటికి పాటించడం లేదు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి  కమిటీపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని, పారదర్శకంగా అవినీతి లేకుండా పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  


ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు

- జంపాల రజిత, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చే సమయంలో నాకు సమాచారం ఇవ్వడం లేదు. కమిటీలో టీపీవో సభ్యుడిగా ఉన్నప్పటికీ కమిషనర్‌గా నాకు సమాచారం ఇవ్వాలి. అయితే కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆర్డీవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అడిగితే నా పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. ఆర్డీవో తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. రాష్ట్రస్థాయిలో మున్సిపల్‌ కమిషనర్‌ల అసోసియేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాను.


సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు

- మధుమోహన్‌, ఆర్డీవో

మున్సిపల్‌ స్థాయిలో అనుమతులు సక్రమంగా ఇస్తున్నారా? అవినీతికి పాల్పడుతున్నారా? అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వాటి కోసమే జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. కూల్చివేత గురించి మున్సిపల్‌ కమిషనర్‌కు చెప్పాల్సిన అవసరం లేదని చట్టంలోనే ఉంది. చట్టం గురించి సక్రమంగా తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని