logo

పల్లెకు వెళ్దాం.. చరితను రాద్దాం!

పల్లెల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే వినూత్న ప్రక్రియను చేపట్టే అరుదైన అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సొంతం చేసుకోబోతున్నారు.. వీరు రాసే చరిత భావితరాలకు  ఉపయోగపడనుంది.

Updated : 07 Dec 2022 06:32 IST

నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో..
న్యూస్‌టుడే, మానుకోట

ప్రాజెక్టుపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న రామా రత్నమాల (పాత చిత్రం)

పల్లెల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే వినూత్న ప్రక్రియను చేపట్టే అరుదైన అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సొంతం చేసుకోబోతున్నారు.. వీరు రాసే చరిత భావితరాలకు  ఉపయోగపడనుంది. చివరి సెమిస్టర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వివిధ విభాగాల విద్యార్థులు దీనిని ఒక ప్రాజెక్టుగా చేపట్టి ఈ క్రతువులో భాగస్వాములు కానున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘మన ఊరు-మన చరిత్ర’ అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టగా మహబూబాబాద్‌ జిల్లాలోనూ శ్రీకారం చుట్టారు.

జిల్లాలోని మహబూబాబాద్‌, గార్ల, మరిపెడ, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రాజెక్టు జిల్లా సమన్వయకర్తగా మహబూబాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ రామా రత్నమాలను నియమించారు. డిగ్రీ కళాశాలలకు సమన్వయకర్తలను ఏర్పర్చి కళాశాల వారీగా కమిటీలను నెలకొల్పారు. ప్రాజెక్టు ప్రత్యేకత,  విద్యార్థులు చేయాల్సిన పని, తదితర విషయాలపై జిల్లా సమన్వయకర్త ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమావేశాలను నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ ఆర్‌.సీతారాంతో జూమ్‌ వేదికగా సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. ఈ నెల 15నుంచి విద్యార్థులు సమాచారాన్ని సేకరించే పని ప్రారంభిస్తారు. నెలాఖరు వరకు పూర్తి చేసి కళాశాల వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.

ప్రశ్నావళి ఇలా..

మన ఊరు-మన ప్రాజెక్టులో విద్యార్థులు తమ గ్రామంలోని సమగ్ర విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక ప్రశ్నావళిని రూపొందించారు.
 భౌగోళిక నైసర్గిక స్వరూపం, జలవనరులు, అడవులు, వ్యవసాయం, చారిత్రక అంశాలు, గ్రామం ఎప్పుడు ఏర్పడింది. పేరు ఎలా వచ్చింది. ఆలయాలు, శాసనాలు. ప్రజల జీవన విధానం, చేతి వృత్తులు, ఆర్థిక అంశాలు, పంటలు, చేతి వృత్తులు, సామాజిక అంశాలు.. సామాజిక వర్గాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, సాంస్కృతిక అంశాలు, ఆటపాటలు, జాతరలు, ప్రత్యేక పండుగలు, కవులు, పండితులు, రచయితలు, సాహితీ వేత్తలు, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణం, తదితర విషయాలను ప్రశ్నలతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సమాచారం కోసం తల్లిదండ్రులు, వయో వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, సర్పంచి, స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామ అధికారులు తదితరులను సంప్రదించాల్సి ఉంటుంది. గ్రామానికి సంబంధించి గణాంకాలను సంబంధిత అధికారుల నుంచి సేకరించాలి.


పుస్తక రూపంలో వెలువడుతుంది

- రామారత్నమాల, మన ఊరు మన చరిత్ర ప్రాజెక్టు జిల్లా సమన్వయకర్త

తమ గ్రామాల చరిత్రలను రాయడం విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం. దీనివల్ల వారి ఊర్లకు సంబంధించి ఇప్పటి కంటే మరింతగా విస్తృత అవగాహన కలుగుతుంది. విలువైన సమాచారం భవిష్యత్తు తరాల వారికి అందించిన వారవుతారు. విద్యార్ధులు సేకరించిన ఆయా గ్రామాల సమాచారంతో ఒక పుస్తకాన్ని కూడా వెలువరిస్తాం. మున్ముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.


విజయవంతం చేయాలి

- డి.రాజు, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబాబాద్‌

ఈ ప్రాజెక్టున్న ప్రత్యేకతను గుర్తించి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గ్రామ వివరాలను సేకరించి విజయవంతంగా పూర్తి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని