logo

అలుపు లేదు.. గెలుపే!

దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా నిఘానీడన పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఇందుకోసం మైదానంలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Published : 07 Dec 2022 05:25 IST

రేపటి నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం

దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా నిఘానీడన పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఇందుకోసం మైదానంలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

నిఘా నీడన పర్యవేక్షణ

ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పోలీస్‌ కొలువు కొట్టడమే లక్ష్యంగా మైదానాల్లో చెమటోడుస్తున్నారు. మరోవైపు ఈ నెల 8 నుంచి జనవరి 3 వరకు ఈవెంట్లను పక్కాగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కాకతీయ విశ్వవిద్యాలయంలో మైదానాన్ని సిద్ధం చేశారు. పొరపాట్లకు తావు లేకుండా ఈసారి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థులు పరుగు తీసేందుకు ట్రాక్‌ను సిద్ధం చేశారు. సెన్సార్ల బిగింపు, సీసీ కెమెరాలను అమర్చారు.

శారీరక కొలతలకు సాంకేతికత వినియోగం: అభ్యర్థుల శారీరక కొలతలను తీసుకునేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రెండు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పరుగులో అర్హత సాధించిన తర్వాతే అభ్యర్థుల కొలతలను తీసుకుంటారు. వీటిల్లోనూ నిబంధనల ప్రకారం ఉంటేనే మిగతా  ఈవెంట్స్‌లో పాల్గొంటారు.

పరుగే కీలకం..: గతంలో 800, 100 మీటర్ల పరుగు, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ నిర్వహించగా ఈసారి వాటిలో కొన్ని మార్పులు చేశారు.  పురుషులకు 1600 మీటర్లు (7.15 నిమిషాలు), మహిళలకు 800 మీటర్లు (5.20 నిమిషాలు) పరుగు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ నిర్వహిస్తారు. పరుగే అత్యంత కీలకం కానుంది. పరుగులో వచ్చిన మార్కులను తుది పరీక్షకు లెక్కలోకి తీసుకుంటారు. షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ అర్హత మాత్రమే.

అంకెల్లో వివరాలు.. 

* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరవుతున్న అభ్యర్థులు: 24,612
* పురుషులు: 19,651 * మహిళలు: 4961 (వీరి కోసం ప్రత్యేకంగా ఈ నెల 10 నుంచి 14 వరకు ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. పురుషులకు ఈ తేదీల్లో ఉండవు.)
* ప్రతి బ్యాచ్‌కు పరుగెత్తనున్న అభ్యర్థులు: 50 (ఐదు సెకన్లకు ఐదుగురు చొప్పున)
* మొదటి రోజు 600 మంది.. రెండో రోజు నుంచి చివరి రోజు వరకు ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తారు.


ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్‌లో రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీలో ఒకటే అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.  ఇలా రెండింటికి అర్హత సాధించినవారు ఉమ్మడి జిల్లాలో సుమారు 16 వేల మంది ఉన్నారు. 8 వేల మంది వరకు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించారు.


అందుబాటులో వైద్యబృందం

 

బ్రాండ్‌ వేదిక

పరుగు తీస్తున్నప్పుడు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ సమయంలో అభ్యర్థులకు గాయాలైతే, ఆరోగ్యం పరంగా ఏమైనా ఇబ్బంది వస్తే ప్రథమ చికిత్స అందించడానికి వైద్యబృందం అందుబాటులో ఉంటుంది. అత్యవసర వైద్యానికి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 108 వాహనం ఉంటుంది.


వీటిని గుర్తుంచుకోండి..

(సీపీ రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం..)

మంగళవారం కేయూ మైదానాన్ని పరిశీలిస్తున్న సీపీ ఏవీ రంగనాథ్‌,
అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, ఇతర పోలీసు అధికారులు

* ఈవెంట్స్‌ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి.  * అభ్యర్థులు ప్రవేశకార్డు, ఇంటిమేషన్‌ లేఖ, స్వీయ సంతకంతో కూడిన పార్ట్‌-2 దరఖాస్తు ప్రింట్‌, కమ్యూనిటీ, ఎక్స్‌సర్వీస్‌ ఎన్‌వోసీ, 24/01/2018 ప్రకారం ఏజెన్సీ ధ్రువపత్రాలను తీసుకొని రావాలి.  * చేతులపై మెహందీ, పచ్చబొట్లు లేకుండా జాగ్రత పడాలి.  * ధ్రువపత్రాల పరిశీలన తర్వాత బయోమెట్రిక్‌ పరిశీలన ఉంటుంది. వీటిని పూర్తి చేసుకున్న అభ్యర్థి చేతికి డిజిటల్‌ ఆర్‌ఎఫ్‌డీ బ్యాండ్‌ వేస్తారు. మైదానం వీడే వరకు అది చేతికి ఉండాలి.  


ఛాతీలో నొప్పిగా ఉంటే తప్పుకోవాలి

- డాక్టర్‌.బి.శ్రీనివాస్‌, పల్మనాలజిస్టు, మహబూబాబాద్‌

శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు జలుబు ఉంటే ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటిని తాగాలి. పాలు లేదా ఆహారం, పండ్లు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. పరుగెత్తుతున్న సమయంలో కళ్లు తిరిగినట్లు, ఛాతీలో నొప్పిగా ఉంటే వెంటనే తప్పుకోవాలి. అవసరముంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. లేకుంటే ప్రమాదకరం అవుతుంది. శ్వాస సమస్యలు రాకుండా ఉండేందుకు మెడిటేషన్‌ చేయాలి. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని