logo

ప్రజావాణి ఇదండి.. గట్టిగా గళమెత్తండి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో కేంద్రం అనేక విభజన హామీలను ఇచ్చింది. వీటిల్లో కీలకమైనవి ఉమ్మడి వరంగల్‌కు సంబంధించినవే ఉన్నాయి.

Updated : 07 Dec 2022 06:31 IST

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
ఈనాడు, వరంగల్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కార్పొరేషన్‌, జనగామ, న్యూస్‌టుడే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో కేంద్రం అనేక విభజన హామీలను ఇచ్చింది. వీటిల్లో కీలకమైనవి ఉమ్మడి వరంగల్‌కు సంబంధించినవే ఉన్నాయి. కాజీపేటలో పీవోహెచ్‌, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో ఉక్కు కర్మాగారం.. వీటిలో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. మరోవైపు కేంద్రం.. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాలకు ఇవ్వాల్సిన అనేక ప్రాజెక్టులు, నిధులు ఉన్నాయి. బుధవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న  నేపథ్యంలో మన ఐదుగురు ఎంపీలు సమస్యలపై సభలో గళమెత్తాల్సిన అవసరంపై ప్రత్యేక కథనం..

దయాకర్‌, కవిత, సంజయ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వెంకటేశ్‌ నేత


వరంగల్‌

నిధులొస్తేనే ‘స్మార్ట్‌ సిటీ..’ 

వరంగల్‌ ప్రధాన తపాలా కార్యాలయం కూడలిలో అసంపూర్తిగా స్మార్ట్‌ రోడ్డు పనులు

ఓరుగల్లుకు కేంద్రం ఇచ్చిన ఆకర్షణీయ పథకం (స్మార్ట్‌ సిటీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో ఈ పథకం రెండో దశలో వరంగల్‌కు దక్కింది. మొత్తం రూ.983 కోట్లకు మంజూరు చేసింది. ఇందులో కేంద్రం, రాష్ట్రం వాటాలు సగం సగం. అంటే రూ.491 కోట్లు కేంద్రం వాటా. ఇప్పటికి కేంద్రం విడుదల చేసింది రూ.150 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం తమ మ్యాచింగ్‌ గ్రాంటు ఇచ్చి యుటిలైజేషన్‌ ధ్రువపత్రం ఇస్తేనే కేంద్రం నిధులిస్తానంటోంది. దీనిపై వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ గళమెత్తాలి. వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హమీల నిధుల కింద ఇచ్చిన నిధులు, అభివృద్ధి వివరాలను తెలియజేసి స్మార్ట్‌ సిటీ పథకం కింద మరో రూ.150 కోట్లు విడుదల చేసేలా చొరవ చూపాలి.

ఇదీ పరిస్థితి: ఈ పథకం కింద మొత్తం 90 పనుల వరకు ప్రతిపాదించగా, నగరంలో పూర్తయినవి 25 మాత్రమే. అనేక స్మార్ట్‌ రోడ్లు నిధులు లేక ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విమానం రావాలి: వరంగల్‌లో విమానాశ్రయాన్ని ‘ఉడాన్‌’ కింద ఇస్తామని కేంద్రం చెబుతోంది. మామునూరులో అందుబాటులో స్థలం.. రన్‌వే సైతం ఉందని వివరించి, ఉడాన్‌ కింద వెంటనే కేంద్రం విమానాశ్రయం మంజూరు చేసేలా పోరాడాలి.

ఔళి పార్కును గుర్తించాలి: వరంగల్‌ జిల్లాలో కాకతీయ మెగా జౌళి పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్రం ‘పీఎం మిత్ర’ పథకం కింద దేశంలో ఏడు జౌళిపార్కులకు నిధులు ఇస్తామని చెబుతోంది. ఈ పథకం మనకు రావాలని ఎంపీ సభలో గట్టిగా అడగాలి. ఇది మంజూరైతే కనీసం రూ.500 కోట్లు దక్కే అవకాశం ఉంది.
పీవోహెచ్‌ పరిశ్రమ - కాజీపేటలో అనేక రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. పీరియాడిక్‌ ఓవరాలింగ్‌ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం 60 ఎకరాల వరకు భూసేకరణ చేసిపెట్టింది.  ఈ పనులు ప్రారంభం కాలేదు. పూర్తయితే వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. కాజీపేట ప్రత్యేక డివిజన్‌గా చేయాలనే డిమాండు కూడా ఉంది.

అన్ని అంశాలపై ప్రశ్నిస్తాం : - పసునూరి దయాకర్‌, వరంగల్‌ ఎంపీ

ముఖ్యమంత్రి ఇప్పటికే ఫ్లోర్‌ లీడర్లతో మాట్లాడారు. కాజీపేట పీవోహెచ్‌, కోచ్‌ ఫ్యాక్టరీ, కొత్త రైళ్ల ఆవశ్యకత, కాజీపేట డివిజన్‌తోపాటు, స్మార్ట్‌ సిటీ పథకానికి నిధులివ్వాలని గట్టిగా కోరుతాం. వరంగల్‌ కరీంనగర్‌ రహదారి విస్తరణ, సర్వీసు రోడ్ల మంజూరుతోపాటు వరంగల్‌కు రావాల్సిన అన్ని ప్రాజెక్టులపై సభలో ప్రశ్నిస్తాను.


మహబూబాబాద్‌

గిరిజన విశ్వవిద్యాలయం కావాలి సాకారం

 

విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేటాయించిన స్థలం

ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది.  రెండేళ్ల కిందట ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో 837 సర్వేనెంబరులోని 360 ఎకరాల ప్రతిపాదిత స్థలం సేకరించి గిరిజన సంక్షేమశాఖకు ఏడాది కిందట అప్పగించారు. ఇది జాప్యం అవుతుండడంతో జాకారంలోని వైటీసీలో తరగతులను నిర్వహిస్తామన్నారు. అది కూడా సాధ్యం కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు ప్రారంభించేలా ఎంపీ కవిత లోక్‌సభలో మాట్లాడాలి.

మరిన్ని: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనం నిర్మాణానికి స్థల సేకరణ జరిగింది. నిధుల కేటాయింపు చేసి భవనాల నిర్మాణం చేపట్టాలి.
* ఎన్‌హెచ్‌ 365వ జాతీయ రహదారిపై గూడూరు, ఖానాపురం వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనులను పూర్తి చేయాలి. కొత్తగా అనుమతి ఇచ్చిన జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపట్టాలి.

తరగతుల నిర్వహణే లక్ష్యంగా.. : - మాలోతు కవిత, ఎంపీ, మహబూబాబాద్‌

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు తరగతుల నిర్వహణ గురించి సభలో ప్రస్తావిస్తాను. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రైళ్ల నిలుపుదల, పెండింగ్‌ బిల్లులు, కేంద్రీయ విద్యాలయానికి నూతన భవనాలకు అనుమతి తదితర అంశాలపై మాట్లాడుతాను.


పెద్దపల్లి

మన ఎంపీలపైనే ఆశలు
కాళేశ్వరం.. కల నెరవేరాలి

 

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవపూర్‌, మల్హర్‌, మహాముత్తారం, పలిమెల మండలాలు వస్తాయి.. ఇక్కడి సమస్యలు.
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం దీనిపై అంతగా దృష్టి సారించడం లేదు. ఎంపీ దీనిపై గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
* గోదావరి పునరుజ్జీవ పథకంలో భాగంగా రూ.132.73 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి 90 గ్రామాలను ఎంపిక చేశారు. మూడేళ్లయినా నిధులు మంజూరు కావడం లేదు. ఈ పథకం అమలైతే గోదావరి ప్రక్షాళన, స్థానికులకు మేలు జరుగుతోంది.
* ఐదు మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఇక్కడ మాడిఫైడ్‌ ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ (మాడ) కార్యాలయం ఉండేది. దానిని ఏటూరునాగారం ఐటీడీఏకు తరలించారు. ఈ క్రమంలో మహదేవ్‌పూర్‌లో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.


కరీంనగర్‌

 

 

కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం కింద హనుమకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు వస్తాయి.. ఇక్కడి సమస్యలు.

జాతీయ రహదారిపై దృష్టి పెట్టాలి

జాతీయ రహదారి 163 విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఓరుగల్లు నగరం కోసం నిర్మించిన బైపాస్‌లో అనేక ఇంజినీరింగ్‌ లోపాలు ఉన్నాయి. కరీంనగర్‌ నుంచి వచ్చే భారీ వాహనదారులు బైపాస్‌పైకి ఎక్కడానికి నానా తంటాలు పడుతున్నారు.  యూటర్న్‌ తిరిగే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. లోపాల పుట్టగా ఉన్న ఈ రహదారి డిజైన్‌ను మళ్లీ కరీంనగర్‌, వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణలోనూ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద, హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ వద్ద మరో బైపాస్‌ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.  పాత విధానంలో రోడ్డు వేస్తే వాహనదారులకు మళ్లీ అవస్థలు తప్పేలా లేవు. ఈ విషయమై ఎంపీ బండి సంజయ్‌ గళమెత్తి పాత పొరపాటు జరగకుండా చూడాలి. కరీంనగర్‌ వరంగల్‌ హైవే పనులు కూడా వేగంగా పూర్తయితే వేలాది మంది వాహనదారులకు ఇబ్బంది ఉండదు.


జనగామ

ప్రజావసరాలే కీలకం..

భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలో జనగామ నియోజకవర్గం ఉంటుంది. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి ఇక్కడి సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక రైల్వేస్టేషన్‌ సమగ్రాభివృద్ధి, రద్దు చేసిన శాతవాహన, కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల పునరుద్ధరణ. విశాఖ-నాందేడ్‌, సంబల్‌పూర్‌-నాందేడ్‌, చార్మినార్‌, నాగర్‌సోల్‌ షిరిడీ రైళ్లను నిలపాలి.
* ప్రతిపాదన దశలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను వంగపల్లి రామాజీపేట పరిధి వరకు విస్తరించాలి. * జనగామ పట్టణ భూగర్భడ్రైనేజీ పథకం అమలు చేయించాలి. నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టాలి.

ప్రధాని దృష్టికి తీసుకెళ్తాను.. :  - ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జనగామపై ప్రత్యేక దృష్టిసారిస్తా. నియోజకవర్గ అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 14న అనుమతి తీసుకున్నాం. ఘట్‌కేసర్‌ వరకు ఉన్న లోకల్‌ రైళ్ల ప్రతిపాదనను జనగామ వరకు పొడిగించడానికి అవకాశం ఉంది. 60 శాతం నిధులు కేంద్రం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు సమకూర్చే విషయంలో సానుకూలత కనబర్చనందున ఆ నిధులనూ కేంద్రమే భరించాలని కోరుతాను. రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని