logo

ఇక్కడ తరచూ భూకంపమే..!

ఈ చిత్రం చూడగానే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం తాలుకు బాంబు పేలుళ్లు అనుకుంటే పొరపాటే.. ఇది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లిలో ఇటీవల క్వారీని పేల్చిన దృశ్యం.

Published : 08 Dec 2022 04:17 IST

మునిపల్లి క్వారీల్లో భారీ పేలుళ్లు

ఈ చిత్రం చూడగానే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం తాలుకు బాంబు పేలుళ్లు అనుకుంటే పొరపాటే.. ఇది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లిలో ఇటీవల క్వారీని పేల్చిన దృశ్యం. ఇక్కడి క్వారీల్లో బోరు బ్లాస్టింగ్‌ చేస్తుండడంతో మునిపల్లితోపాటు స్థానిక గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.  ఇలాంటి మూడు క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.


ఈనాడు, వరంగల్‌: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పరిధిలో గత 30 ఏళ్లుగా క్వారీలు నడుస్తున్నాయి. అయిదేళ్ల కిందటి వరకు కంప్రెషర్‌ జాకీ విధానంలో రాయిని పగులగొట్టి తరలించేవారు. పెద్ద మొత్తంలో తవ్వేందుకు కొన్నేళ్లుగా బోర్‌ బ్లాస్టింగ్‌ విధానంలో ప్రమాదకరంగా పేలుళ్లు చేపడుతున్నారు. కనీసం మూడు నాలుగు నెలలకోసారి ఇలా భారీ ఎత్తున పేలుళ్లు చేపడుతుండడంతో ఈ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల వరకు భూకంపం వచ్చిందా అన్నట్టు దద్దరిల్లిపోతోంది. ఈ ధాటికి భారీ రాళ్లు ఎగిరి పక్కనున్న రహదారులపై చెల్లాచెదురుగా పడుతున్నాయి.

పట్టించుకోని ప్రభుత్వ శాఖలు

క్వారీల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి బోరు బ్లాస్టింగ్‌ జరుపుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అనుమతి ఇచ్చే గనుల శాఖతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణ సైతం కరవైంది. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


శివాలయం.. పూజలకు దూరం

కొండపై ఉన్న దేవాలయం

ఈ క్వారీల వల్ల పరిసరాల్లోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. జలవనరులు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందులోని ఒక క్వారీపై చారిత్రక శివాలయం  ఉంది. గతంలో స్థానికులు వెళ్లి పూజలు చేసేవారు. ఇప్పుడు భారీ పేలుళ్ల ధాటికి అక్కడికి వెళ్లడం లేదని మునిపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

* నగరానికి దగ్గరగా ఉన్నా ఇక్కడి భూములకు సరైన విలువ రావడం లేదు. ఈ ప్రాంతంలో క్వారీలు ఉన్నాయని భూముల క్రయవిక్రయాలు అంతగా జరగడం లేదు. ఏదైనా ఆపదకు భూములు అమ్ముకుందామన్నా ఎవరూ కొనడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.  


రక్షణ చర్యలు కరవే

శిరస్త్రాణాలు లేకుండా పనిచేస్తున్న కార్మికులు

క్వారీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదకరంగా రాళ్లను తొలగించే వారికి కనీసం శిరస్త్రాణాలు లేవు. గతంలో ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని పలు క్వారీల్లో జరిగిన ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ క్వారీలకు కొందరు ప్రజాప్రతినిధుల అండ ఉందని స్థానికులు చెబుతున్నారు.

* గనుల శాఖ అధికారిని వివరణ కోరగా, అనుమతి ఇవ్వడం వరకే తమ పని అని.. క్వారీ పేల్చివేతల పర్యవేక్షణ పోలీసు శాఖదని చెప్పడం గమనార్హం.


మా ఇళ్లు దెబ్బతింటున్నాయి
- సునీల్‌కుమార్‌, మునిపల్లి

మూడు నాలుగు నెలలకోసారి మునిపల్లి వద్ద క్వారీలో రాత్రివేళల్లో బోరు బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ ధాటికి భూకంపం వచ్చినట్టుగా ఉలిక్కిపడి నిద్రలేస్తున్నాం. మా ఇళ్లు దెబ్బతింటున్నాయి. గోడలకు పగుళ్లు వస్తున్నాయి. నిర్వాహకులను అడిగితే పాత ఇళ్లు కూలిపోతే తామేం చేయాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.


గుట్ట కింద మా భూమి ఉంది
- కిరణ్‌కుమార్‌ వేల్పుల, మునిపల్లి

ఈ క్వారీ గుట్ట కింద మా భూములు ఉన్నాయి. అదంతా నాశనం అవుతోంది. పంటలు వేసుకోలేకపోతున్నాం. బోరు బ్లాస్టింగ్‌ ఆపాలని ఊరివాళ్లం అడుగుతున్నాం. అవసరాలకు భూములు అమ్ముదామంటే కుదరడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని