logo

కంటి పరీక్షలకు సర్వం సిద్ధం..!!

ప్రభుత్వం రెండో విడతలో నిర్వహించ తలపెట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది.

Published : 19 Jan 2023 06:14 IST

డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం రెండో విడతలో నిర్వహించ తలపెట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్ధాలు, నేత్ర శస్త్ర చికిత్సలు చేయించాలని ప్రభుత్వం  కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామాల్లో 3.63 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడానికి గుర్తించారు. జనగామ పురపాలక పరిధిలో చేపట్టనున్న కంటి వెలుగు పరీక్షల సన్నద్ధత గురించి బుధవారం ‘న్యూస్‌టుడే’ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎక్కలదేవి మహేందర్‌తో ‘ముఖాముఖి’ నిర్వహించింది.

న్యూస్‌టుడే: జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి చేశారా?

డీఎంహెచ్‌వో: గురువారం నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశాం. ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య సూచనలతో సర్వ సన్నద్ధంగా ఉన్నాం.

నేత్ర పరీక్షలకు చేసిన ఏర్పాట్ల వివరాలు చెబుతారా?

జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 బృందాలను ఏర్పాటు చేశాం. వీరు జిల్లాలోని 16 పీహెచ్‌సీల పరిధిలో కంటి పరీక్షలు చేస్తాయి. మరో 2 బృందాలు జనగామ జిల్లా కేంద్రంలో కొనసాగుతాయి. గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు శిబిరాల ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి విడతలో 5 ఏళ్ల వారికి కూడా కంటి పరీక్షలు చేశారు. ఈసారి 18 ఏళ్ల పైబడిన వారికి అంటున్నారు. చిన్న పిల్లలు వస్తే పరీక్షలు చేస్తారా?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి చేస్తున్నాం. చిన్న పిల్లలు వస్తే పరీక్షలు చేస్తాం. అయితే వారికి అద్దాలు అందుబాటులో ఉండవు.

శిబిరాల పర్యవేక్షణకు తీసుకుంటున్న చర్యలు?

కంటి పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. ఇందులో నలుగురు సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తారు. శిబిరాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకుంటూ రాష్ట్రస్థాయి కంట్రోల్‌ గదికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి నాతో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. వీరంతా ఆయా మండలాల వారీగా పర్యటిస్తూ శిబిరాల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.

న్యూస్‌టుడే: కళ్లద్దాలు పంపిణీ పూర్తయిందా, పరీక్షల తర్వాత నేత్ర శస్త్ర చికిత్సలు ఎక్కడ చేస్తారు?

డీఎంహెచ్‌వో : జిల్లాకు ఇప్పటికే 22,450 కంటి అద్దాలు వచ్చాయి. వీటిని శిబిరాలకు కూడా తరలించాం. పరీక్షల అనంతరం శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని హైదరాబాద్‌ సరోజినీ కంటి ఆసుపత్రి, వరంగల్‌ ప్రాంతీయ కంటి ఆసుపత్రికి తరలిస్తాం. జనగామలో శస్త్ర చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యుడు, ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాట్లు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని