logo

ఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల నిరసన

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గన్నీ సంచులకు డబ్బులు చెల్లింపు విషయంలో ఖమ్మం తరహా విధానాన్ని అవలంభిస్తామంటూ మిర్చి వ్యాపారులు మంగళవారం నిరసన తెలపడంతో కొంత సమయం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి.

Published : 25 Jan 2023 05:56 IST

అధికారులను నిలదీస్తున్న రైతులు

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గన్నీ సంచులకు డబ్బులు చెల్లింపు విషయంలో ఖమ్మం తరహా విధానాన్ని అవలంభిస్తామంటూ మిర్చి వ్యాపారులు మంగళవారం నిరసన తెలపడంతో కొంత సమయం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటలకే జరగాల్సిన జెండా పాట వ్యాపారుల నిరసన కారణంగా రెండు గంటలపాటు వాయిదాపడింది. కొనుగోళ్లు నిలిచిపోవడంతో పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మార్కెట్‌ అధికారులను కొంతమంది రైతులు కొనుగోళ్ల విషయంలో నిలదీశారు. ఈ అంశంపై ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంత్రి దయాకర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడగా గన్నీ సంచులకు ఖమ్మం తరహా విధానంపై వచ్చే నెల 4న మార్కెట్‌ అధికారులు, రైతు సంఘాలు, జిల్లా అధికారులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వ్యాపారులు శాంతించి కొనుగోళ్లు తిరిగి ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపటికే పంట ఉత్పత్తుల వివరాలను నమోదుచేసే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) యంత్రాల్లో సాంకేతిక సమస్య రావడంతో.. మరో అరగంట సమయం కొనుగోళ్లు జరగలేదు. హైదరాబాద్‌లోని పీవోఎస్‌ యంత్రాల నిర్వహణ ఏజెన్సీని సంప్రదించి సమస్యను పరిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని