logo

గణతంత్రం.. స్ఫూర్తిమంతం!

దేశానికి దశదిశ చూపించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర వేడుకలు గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి.

Published : 27 Jan 2023 06:02 IST

స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తూ..

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దేశానికి దశదిశ చూపించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర వేడుకలు గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం 9 గంటలకు ఐడీవోసీ భవనంపై కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పతాకానికి వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 210 మంది ఉత్తమ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవా రంగాల్లో కృషి చేసిన వారికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌తో కలిసి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. ఆ తర్వాత జిల్లా ప్రగతి నివేదికను విడుదల చేశారు. Äకార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌, కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌, డీఆర్‌వో వాసుచంద్ర, పరకాల ఆర్డీవో రాము, డీఆర్‌డీవో శ్రీనివాసకుమార్‌, డీసీఎస్‌వో వసంతలక్ష్మీ, బీసీ సంక్షేమశాఖ అధికారి రామ్‌రెడ్డి, టీజీవో, టీఎన్జీవోస్‌ నాయకులు పాల్గొన్నారు.

అలరించిన ప్రదర్శనలు

కలెక్టరేట్‌ ఆవరణలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాడూరి రేణుక, కాకతీయ కళాక్షేత్రం వెంపటి శ్రావణి శిష్యులు, మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం, మల్లికాంబ మనోవికాస కేంద్రం దివ్యాంగుల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతీయ గీతాలతో పాటు తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను తెలిపే పాటలకు ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, నగర పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ఫొటోలు దిగారు.

ప్రగతి నివేదికలోని ముఖ్యాంశాలు

* జిల్లా కంటి వెలుగు రెండో విడత కార్యక్రామన్ని ఈనెల 19 నుంచి ప్రారంభించారు. 45 వైద్య బృందాలు 282 శిబిరాలను 100 రోజుల పాటు నిర్వహిస్తాయి.

* మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 84 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 74 ఉన్నత పాఠశాలల్లోË అభివృద్ధి పనుల కోసం రూ.84.34 లక్షలు కేటాయించారు.

* వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతుబంధు కింద యాసంగిలో 1.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.123.76 కోట్లు జమ చేశారు. రైతుబీమా కింద 109 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున అందజేశారు.

* దళితబంధు పథకంలో భాగంగా 4153 మందికి రూ.10 లక్షల చొప్పున వంద శాతం రాయితీతో కూడిన రుణాలు అందజేశారు. ః ఖరీఫ్‌లో 61 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 27,969 మంది రైతుల నుంచి 1,21,446 మెట్రిక్‌ టన్నుల వడ్లు కొన్నారు.

* జిల్లాలో ఇప్పటి వరకు 5.21 లక్షల పశువులకు చికిత్స అందించారు. గొల్ల కురుమల జీవనోపాధికి మొదటి విడతలో 13,740 మందికి, రెండో విడతలో 7,348 మందికి గొర్రెల యూనిట్లు మంజూరు చేశారు.

* వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, వ్యాధిగ్రస్తులకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెల రూ. 26.85 కోట్లు ఇస్తున్నారు. 

* పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.198.79 కోట్లతో 523 అభివృద్ధి పనులు, స్మార్ట్‌ సిటీ పథకంలో రూ.948 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

* 94 పరిశ్రమల స్థాపనకు 180 దరఖాస్తులు రాగా, 120 అనుమతులు ఇచ్చారు.

జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు.  సీపీ రంగనాథ్‌, ఇతర అధికారులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని