logo

ఆదర్శ పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయ్‌!

జిల్లాలోని ఆదర్శపాఠశాలలు ప్రైవేటు బడులకు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాయి. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.

Published : 27 Jan 2023 06:02 IST

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆదర్శపాఠశాలలు ప్రైవేటు బడులకు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాయి. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఏటా ఆదర్శపాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. ఆంగ్ల మాధ్యమం కూడా ఉండడంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2023-24)లో ఆరో తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

ప్రతిభ ఆధారంగా ఎంపిక

జిల్లాలో 8 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6 నుంచి 10 వరకు తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్య కూడా అందిస్తున్నారు. ప్రతి విద్యాలయంలో వంద మందికి ప్రవేశాలు కల్పిస్తారు. తొలినాళ్లలో విద్యార్థుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేవారు. పక్కా భవనాలు, ఇతర వసతులు లేకపోయినా నాణ్యమైన బోధనతో మంచి ఫలితాలు సాధించారు. మరో వైపు పిల్లల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి, ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. 7 నుంచి పది వరకు ఖాళీలను కూడా ఇదే తరహాలో భర్తీ చేస్తున్నారు.

పరీక్ష విధానం..

జనవరి 10న దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఏప్రిల్‌ 8న హాల్‌ టికెట్లను విడుదల చేస్తారు. అదే నెల 16న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇతర తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. మే 15న ఫలితాలను విడుదల చేస్తారు.

ఉన్నత ప్రమాణాలతో..

పదో తరగతి విద్యార్థులు ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఆదర్శపాఠశాలల్లో అన్ని వసతులు కల్పించారు. పక్కా భవనాలు నిర్మించి సీసీ కెమెరాలను అమర్చారు. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తర్ఫీదు ఇస్తున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో మెలకువలు నేర్పిస్తున్నారు.

దరఖాస్తు విధానం ఇలా..

గతంలో ప్రవేశ పరీక్షను ఆయా పాఠశాలల పరిధిలోనే నిర్వహించే వారు. ఐదేళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నారు. అన్ని తరగతుల వారికి తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాలకు సంబంధించి 75, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి 25 మార్కులు ఉంటాయి. ఓసీ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు రూ.125 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆదర్శపాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, విద్యార్థులను ఉత్తమంగా తీర్పిదిద్దేందుకు కృషి చేస్తున్నామని బచ్చన్నపేట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ కృష్ణవేణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని