logo

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ఉదయం 9 గంటలకు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

Published : 27 Jan 2023 06:23 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ కృష్ణఆదిత్య

 

విజేతకు బహుమతి అందిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ఉదయం 9 గంటలకు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌, ఏఆర్‌ ఎస్పీ సదానందం, అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌, డీఆర్‌వో రమాదేవి, ఓఎస్డీ గౌష్‌ ఆలం, ఏఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కెకాన్‌ పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్‌, ఎస్పీలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ నేతల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. సాదాసీదాగా వేడుకలు ముగించారు. సభా వేదిక వద్ద ఎలాంటి ప్రసంగం చేయలేదు. ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేయలేదు. వేడుకల ముగింపు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

* జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ముందంజలో ఉన్నాం. జిల్లా ప్రజలకు విద్య, వైద్యం, పోషకాహారం అందించేందుకు ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అన్నింటిలో ములుగు జిల్లా ముందంజలో ఉంటుంది.

చిన్న జాతరకు సకల ఏర్పాట్లు

ఫిబ్రవరి 1 నుంచి జరిగే మినీ మేడారం జాతర విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారి సౌకర్యార్థం జాతీయ రహదారి పొడవునా 3 ప్రాంతాల్లో విడిది గృహాలు నిర్మించేందుకు నిర్ణయించాం. వచ్చే జులై మాసానికల్లా వాటిని పూర్తి చేస్తాం. ఇందులో భాగంగా రూ.1.70 కోట్లతో ములుగు మండలం ఇంచెర్ల, గోవిందరావుపేట మండలం చల్వాయి, తాడ్వాయిలో ఈ విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో కేంద్రంలో సుమారు 300 మంది బస చేసేలా వసతి కల్పిస్తున్నాం. ఈ భవనాలకు అనుసంధానంగా భక్తులు వంట చేసుకునేందుకు కిచెన్‌ షెడ్లు కూడా నిర్మిస్తాం. ములుగు సమీపంలోని గట్టమ్మ గుడి వద్ద కూడా భక్తుల విడిది కేంద్రాన్ని నిర్మించేందుకు నిర్ణయించాం. వచ్చే జాతరకు జులైలోనే ప్రణాళిక అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

కార్యాలయాల భవన నిర్మాణాలపై దృష్టి

జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. అదే ప్రాంగణంలో జిల్లా పోలీసు కార్యాలయానికి ప్రతిపాదించాం. టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అక్కడే జడ్పీ కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించేందుకు ప్రతిపాదించాం. ఈ స్థలానికి ఎదురుగా ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇదే ప్రాంతంలో రూ.1.40 కోట్లతో ఛైల్డ్‌ హోమ్‌ను నిర్మిస్తున్నాం. దీంతో పాటు భరోసా కేంద్రాన్ని కూడా అక్కడే నిర్మిస్తున్నాం. బండారుపల్లి రోడ్డులో ఆర్టీవో, ఎక్సైజ్‌ కార్యాలయాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

ఉచిత శిక్షణతో ఉత్తమ ఫలితాలు

నిరుద్యోగ యువతకు గ్రూప్స్‌, పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం ఉచితంగా అందించిన శిక్షణతో మంచి ఫలితాలు వచ్చాయి. ఐటీడీఏ ద్వారా ఉచిత శిక్షణ కేంద్రాలు నిర్వహించాం. శిక్షణ పొందిన 98 శాతం అభ్యర్థులు విజయవంతం అయ్యారు. రాష్ట్రంలో ఏటూరునాగారం ఐటీడీఏ ముందంజలో ఉంది. ఐటీడీఏ పీవో అంకిత్‌, కో-ఆర్డినేటర్‌ శ్రీరాములు బాగా నిర్వహిస్తున్నారు.

పాఠశాలల్లో సౌకర్యాల కల్పన

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మన ఊరు మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 125 పాఠశాలలను ఎంపిక చేసింది. వాటి అభివృద్ధికి వివిధ రకాలుగా రూ. 50 కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రూ.25 కోట్లు భవనాల నిర్మాణానికి, రూ. 15 కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, రూ.10 కోట్లు పరికరాల కొనుగోలుకు మంజూరయ్యాయి. పనులన్నీ పూర్తి కావొస్తున్నాయి. జిల్లాలో మొత్తం 36 పాఠశాలలను ఎంపిక చేసి ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నాం.

జాతీయ రహదారి విస్తరణ

జాతీయ రహదారుల శాఖకు సంబంధించి ములుగు సమీపంలోని గట్టమ్మ నుంచి ఆరెపల్లి వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేటట్లు కృషి చేస్తునాం. ట్రాఫిక్‌ సమస్య ఉండే గ్రామాలలో అండర్‌పాస్‌ దారుల నిర్మాణాలతో పాటు జిల్లా కేంద్రం, పెద్ద గ్రామాల్లో ఐరన్‌ ఫుట్‌ ఓవర్‌ వంతెనలను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశాం. జంగాలపల్లి నుంచి గాంధీనగర్‌, ఏటూరునాగారం నుంచి భద్రాచలం వెళ్లే రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అవకాశం ఉంది.

ఇ-హెల్త్‌ ప్రొఫైల్‌: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఇ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. నూటికి నూరు శాతం పూర్తి చేశాం.

బస్‌ డిపో ఏర్పాటుకు స్థలాన్వేషణ

ములుగులో బస్‌ డిపో ఏర్పాటుకు స్థలాన్వేషణ జరుగుతోంది. మేడారం జాతరను పురస్కరించుకొని డిపో స్థలాన్ని వెతుకుతున్నాం. జాతరకు బస్సులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయి.

గ్రంథాలయాల ఆధునికీకరణ

ములుగులో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని డిజిటల్‌ గ్రంథాలయంగా ఏర్పాటు చేయనున్నాం. నూతనంగా ఎన్నికైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవిందునాయక్‌ లైబ్రరీల అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ చొరవతో బీసీ మర్రిగూడెంలో డిజిటల్‌ లైబ్రరీకి ప్రణాళిక చేస్తున్నాం. ఏటూరునాగారంలలో లైబ్రరీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని