logo

ఘనంగా గణతంత్రం..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు.  జిల్లా పాలనాధికారి బి.గోపి తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, జాతిపిత గాంధీజీ చిత్రపటాలకు నివాళులర్పించారు.

Published : 27 Jan 2023 06:23 IST

జెండాకు వందనం చేస్తున్న అధికారులు

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు.  జిల్లా పాలనాధికారి బి.గోపి తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, జాతిపిత గాంధీజీ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఉదయం 9గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాలోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీవత్స, డీసీపీ వెంకటలక్ష్మి, ఆర్డీవో మహేందర్‌జీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేడుకలను ఆర్భాటంగా నిర్వహించవద్దన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే జిల్లాలో సాదాసీదాగా వేడుకలను ముగించినట్లు తెలుస్తోంది.

ఉసూరుమన్న స్వాతంత్య్ర సమరయోధులు

గణతంత్ర దినత్సోవం సందర్భంగా జిల్లాలోని స్వాతంత్య్ర సమరవీరులకు సన్మానం ఏర్పాటుచేసినట్లు ఓ పత్రికలో సమాచారాన్ని చూసి కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులు గురువారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా జాతీయ పతాకావిష్కరణ తర్వాత కేవలం ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి కార్యక్రమాన్ని ముగించేశారు. దాంతో కలెక్టరేట్‌కు వచ్చిన సమరవీరులు ఉసూరుమన్నారు. గణతంత్ర వేడుకల్లో సన్మానం చేయకపోయినా.. తమకు అధికారుల నుంచి కనీస మర్యాద దక్కలేదని వాపోయారు. సన్మానాలు జరగకపోవడంతో దుగ్గొండికి చెందిన హెచ్‌.ఆగయ్య కొత్తవాడకు చెందిన ఎ.లక్ష్మీనారాయణ, బీంరెడ్డి తదితర స్వాతంత్య్ర సమరవీరులు సభా వేదిక వద్ద నుంచి వెనుదిరిగారు.  

సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న పాలనాధికారి గోపి, జడ్పీ  ఛైర్‌పర్సన్‌ జ్యోతి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ, డీసీపీ వెంకటలక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని