logo

విద్య, వైద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట

గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం విద్య, వైద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తున్నామని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.

Published : 27 Jan 2023 06:24 IST

ప్రసంగిస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం విద్య, వైద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తున్నామని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సమీపంలోని కుమురం భీం మినీ స్టేడియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. 8 సంచార వైద్య బృందాల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి 32,999 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.

రూ.424.50 కోట్లతో ప్రగతి పనులు

గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా వివిధ గ్రాంట్ల కింద మంజూరైన 1009 అభివృద్ధి పనులను రూ.424.50 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. 958 పనులు పూర్తి కాగా మరో 51 ప్రగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద 44 ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలు రూ.7.04 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. మినీ మేడారానికి రూ.60.85 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. 9 రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి సంఘాల్లోని సభ్యులకు వ్యవసాయ యాంత్రికరణ వాహనాలు, పనిముట్లు, గోదాముల యూనిట్లు అందించినట్లు వెల్లడించారు. టీఆర్‌ఎఫ్‌ కింద 102 మంది గిరిజనులకు రూ.27.19 లక్షలు అందించినట్లు పేర్కొన్నారు. ఏపీవో వసంతరావు, ఏవో రఘు, డీడీ పోచం, మేనేజర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఈవో సారయ్య, స్టాటిస్టికల్‌ అధికారి రాజ్‌కుమార్‌, ఏసీఎంవో కోడి రవీందర్‌, స్పోర్ట్స్‌ అధికారిణి శ్యామలత, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

6,761 మందికి స్వయం ఉపాధి

ట్రైకార్‌ సంస్థ ద్వారా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు గాను 6,761 మంది గిరిజన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ యూనిట్లను అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1,899 మందికి రూ.16.30 కోట్ల సబ్సిడీతో వివిధ స్వయం ఉపాధి యూనిట్లు అందించేందుకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21న మెగా జాబ్‌మేళా నిర్వహించి 22 ప్రైవేటు కంపెనీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 784 మంది గిరిజనులకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని