logo

ఎట్టకేలకు పాఠశాలకు రహదారి..

నర్సింహులపేట మండలం బాసుతండా పంచాయతీ శివారు మంగళితండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి నిర్మించారు.. దీంతో పొలం గట్లపై నుంచి చిన్నారుల నడక యాతన తప్పింది.

Published : 27 Jan 2023 06:26 IST

వాగు పక్కనే నిర్మించిన మట్టి రహదారి

నర్సింహులపేట, న్యూస్‌టుడే: నర్సింహులపేట మండలం బాసుతండా పంచాయతీ శివారు మంగళితండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి నిర్మించారు.. దీంతో పొలం గట్లపై నుంచి చిన్నారుల నడక యాతన తప్పింది. మంగళితండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 21 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 15 ఏళ్ల కిందట పాఠశాలకు భవనాన్ని నిర్మించారు. దారి చూపలేదు. దీంతో విద్యార్థులు పొలం గట్లు, జయపురం శివారు దేవుడు చెరువుకు వెళ్లే వాగుల్లోంచి పాఠశాలకు వెళ్లేవారు. ఇటీవల ’ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారులు స్పందించారు. జిల్లా పాలనాధికారి, విద్యాశాఖాధికారి ఆదేశానుసారంతో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు దారి నిర్మించి విద్యార్థుల కష్టాలను దూరం చేశారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం పాఠశాలను తహసీల్దార్‌ వివేక్‌, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎంఈవో గుగులోతు రాము, ఎస్సై మంగీలాల్‌, సర్పంచి సురేష్‌, జయపురం గ్రామ పెద్దలు నెలకుర్తి సత్తిరెడ్డి తండావాసులతో కలిసి సందర్శించారు. డొంకదారులు, పొలం గట్ల రహదారులను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. జేసీబీ యంత్ర సహాయంతో నాలుగు ఫీట్ల మట్టి రహదారిని ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వరుస కథనాలు ప్రచురించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘ఈనాడు’కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని