logo

బస్సుల్లేక.. ప్రయాణాలు సాగక

భూపాలపల్లి నుంచి ములుగుకు కేవలం 36 కి.మీ దూరమే.. అయినా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు జిల్లాలు ఏర్పడిన తర్వాతా పరిస్థితి మారలేదు.

Published : 28 Jan 2023 03:50 IST

ములుగు-భూపాలపల్లి మార్గంలో కష్టాలు
న్యూస్‌టుడే, భూపాలపల్లి

గణపురం క్రాస్‌ వద్ద ములుగు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

భూపాలపల్లి నుంచి ములుగుకు కేవలం 36 కి.మీ దూరమే.. అయినా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు జిల్లాలు ఏర్పడిన తర్వాతా పరిస్థితి మారలేదు. నిత్యం భూపాలపల్లి డిపోకు ములుగు, ఏటూరునాగరానికి వెళ్లే ప్రయాణికులు వందల సంఖ్యలో వస్తుంటారు. భూపాలపల్లి డిపో నుంచి ములుగుకు ఒకే ఒక్క బస్సు మాత్రమే ఉంది. దీంతో నిరీక్షణ తప్పడం లేదు. మణుగూరు డిపో నుంచి ఏటూరునాగరం మీదుగా భూపాలపల్లికి నడిచే మూడు బస్సు సర్వీసులు ఉన్నాయి. అవి కూడా అందుబాటులో లేకపోతే ఇక ఆ రోజు ప్రయాణం ముగిసినట్టే.. ఉన్న ఒక్క బస్సు రూటు వయా గణపురం మండలం చెల్పూరు, పెద్దపూర్‌, లక్ష్మీదేవిపేట్‌, వెంకటాపూర్‌ మీదుగా ములుగు వెళ్తుంది. గణపురం క్రాస్‌ రోడ్డు నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ దారిలోనే పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉండటం విశేషం.. పర్యాటక ప్రాంతానికి వెళ్లడానికి బస్సు లేకపోవడం ఒక సమస్యగా మారింది. తప్పని పరిస్థితిలో ప్రయాణం చెయ్యాల్సిన వారు గణపురం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చి పరకాల బస్సులు ఎక్కుతున్నారు. అవి కూడా పరిమిత సంఖ్యలోనే ఉండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఏటూరునాగారం వెళ్లాల్సిన వారు గణపురం క్రాస్‌రోడ్డు వద్ద బస్సు దిగి, ములుగు వెళ్లే పరకాల బస్సు డిపో ఎక్కి అక్కడి నుంచి ఏటూరునాగారానికి మరో బస్సు ఎక్కాల్సి వస్తోంది. దీంతో ఛార్జీల భారం, సమయం వృథా తప్పడం లేదు. జిల్లా ఏర్పడిన తర్వాత గత నెల డిసెంబరులో భూపాలపల్లి డిపో లాభాల బాట పట్టింది. ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సులు నడుపుతున్నారు. కానీ, ములుగుకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది.


రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నా..

బంధం మల్లయ్య, సింగంపల్లి

ఏటూరునాగారం వెళ్లాలని భూపాలపల్లి బస్టాండుకు వచ్చా. రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నా. బస్సు ఎప్పుడొస్తుందని అధికారులను అడిగితే మధ్యాహ్నం 3 గంటలకు బస్సు ఉందని చెప్పారు. అప్పటి వరకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. సమయం వృథా అవుతోంది. బస్సు డిపో వారు మరికొన్ని బస్సులు తిరిగేలా చేయాలి.


బస్సు లేక ఇక్కడే ఉన్నా..

చిర్రా లక్ష్మీనారాయణ, ములుగు

మా అక్కకు బాగోలేదని చెప్పడంతో చూడటానికి భూపాలపల్లికి వచ్చా.. అనంతరం తిరిగిపోయే క్రమంలో గణపురం క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చాను. గంటన్నర నుంచి బస్సు కోసం ఎదురుచూస్తున్నా. నాతో పాటు ములుగు వెళ్లాల్సిన వారు చాలా మంది ఉన్నారు. అధికారులు భూపాలపల్లి నుంచి ములుగు మరిన్ని బస్సులు తిరిగేలా చర్యలు తీసుకోవాలి.


ప్రజల నుంచి అభ్యర్థనలు రాలేదు..

ప్రతిమా రెడ్డి, డీఎం, భూపాలపల్లి

ప్రస్తుతం డిపో నుంచి ఒక్క బస్సు మాత్రమే నడుస్తోంది. ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తే.. తప్పకుండా బస్సు ట్రిప్పులను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికుల ఇబ్బందులు వీలైనంత మేరకు పరిష్కరించేందుకు, బస్సులను నడిపేందుకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని