logo

యారిటీ, ఖాళీల జాబితా విడుదల

జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో శుక్రవారం సాయంత్రమే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాతో పాటు ఖాళీల వివరాలను పొందుపర్చారు.

Published : 29 Jan 2023 06:21 IST

సీనియారిటీ, ఖాళీల జాబితా విడుదల

తరగతి గదిలో విద్యార్థులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో శుక్రవారం సాయంత్రమే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాతో పాటు ఖాళీల వివరాలను పొందుపర్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలుత బదిలీలు, ఆ తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 432 విద్యాలయాలుండగా, మొత్తం 19,076 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం జిల్లాకు మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,804 ఉండగా ప్రస్తుతం 1,414 మంది ప్రభుత్వ బడుల్లో పనిచేస్తుండగా.. వారి సీనియారిటీతో కూడిన జాబితాను విడుదల చేశారు. పదోన్నతులు, బదిలీల కోసం 390 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో తప్పనిసరి బదిలీ కింద 282 మందికి స్థానచలనం కలగనుంది. వీరంతా ఒకే చోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారే కావడం గమనార్హం.. జీవో 317 కింద జిల్లాకు వచ్చిన వారికి జీరో సర్వీసు వర్తింపజేయనుండటంతో వారంతా బదిలీలకు దూరంగా ఉండనున్నారు. 317 జీవో ద్వారా ఈ జిల్లాకు వచ్చిన 753 మంది ఉపాధ్యాయులు ఇక్కడే విధులు నిర్వర్తించనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే వీరికి అనుకూలమైన ప్రాంతం లభిస్తేనే వారు ప్రస్తుతం ఉన్న స్థానాలను వదలనున్నారు.

పదోన్నతులు ఇలా..

అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నారు. జిల్లాలో పీజీహెచ్‌ఎం పోస్టులు 64కు ప్రస్తుతం 45 ఖాళీగా ఉన్నాయి. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 79కి 43 ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియార్టీ ప్రాతిపదికన స్కూల్‌ అసిస్టెంట్లకు, ఎస్టీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. అదేవిధంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల పోస్టులు(ఎస్‌ఏ) 114 ఖాళీగా ఉన్నాయి. ఇందులో గణితం 9, భౌతికశాస్త్రం 10, జీవశాస్త్రం 24, సాంఘికశాస్త్రం 33, తెలుగు 11, ఆంగ్లం 16, హిందీ 5, ఫిజికల్‌ డైౖరెక్టర్లు(పీడీ)లు 6 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70 శాతం ఖాళీలను సీనియార్టీ ప్రాతిపదికన అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేస్తారు. అలాగే ఒకే పాఠశాలలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. దీని ప్రకారం జిల్లాలో ఇటీవల 317 జీవో కింద బదిలీపై వచ్చినవారు 753 మంది ఉపాధ్యాయులు తప్ప మిగిలిన వారికి అర్హత ఉంటుంది. ఫిబ్రవరి 14న పీజీహెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. అదే నెల 16 నుంచి 18 వరకు స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. 22, 23వ తేదీల్లో ఎస్‌ఏల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత 25 నుంచి 27వ తేదీ వరకు ఎస్జీటీలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అభ్యంతరాలకు మార్చి 5 నుంచి 19 వరకు అవకాశమిస్తారు.  

వీరు కదలాల్సిందే..

ఒకే బడిలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న వారిలో జిల్లాలో 239 మంది స్కూల్‌ అసిస్టెంట్లు తప్పనిసరి బదిలీ కింద తమ స్థానాలు వదలుకోవాల్సి ఉంటుంది. అయిదేళ్లు పూర్తి చేసుకున్న పీజీహెచ్‌ఎంలు ఐదుగురు బదిలీ కానున్నారు. ఇందులో పీజీ హెచ్‌ఎం ఒక్కరు, ఎస్‌జీటీలు 179 మంది, భాషా పండితులు 20, పీఈటీలు ఐదుగురు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 9 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 69 మంది ఉపాధ్యాయులున్నారు. వారి సర్వీసు మూడేళ్లు మాత్రమే ఉంటే మినహాయింపు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు