logo

గణపురం.. ప్రగతి మణిహారం

జయశంకర్‌ జిల్లాలో ఏ మండలానికి లేని విశిష్టత గణపురానికి ఉంది.. ఇక్కడ పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. విద్య, వైద్య కళాశాలలు ఏర్పడుతున్నాయి.

Updated : 29 Jan 2023 07:14 IST

పర్యాటక, పారిశ్రామిక కేంద్రాల నిలయం
న్యూస్‌టుడే, గణపురం(చిల్పూర్‌)

జయశంకర్‌ జిల్లాలో ఏ మండలానికి లేని విశిష్టత గణపురానికి ఉంది.. ఇక్కడ పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. విద్య, వైద్య కళాశాలలు ఏర్పడుతున్నాయి. కోటగుళ్లు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్శిస్తుండగా.. పారిశ్రామిక ప్రాంతాలు అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలనిస్తున్నాయి. గతంలో రామప్ప రామలింగేశ్వరాలయం, రామప్ప సరస్సు, జయశంకర్‌ జిల్లాలో ఉండడంతో పర్యాటకపరంగా గణపురం కోటగుళ్లు, గణపసముద్రం తర్వాత స్థానంలో ఉండేవి.. ఇప్పుడవి ములుగు జిల్లాలోకి వెళ్లడంతో గణప సముద్రమే జిల్లాలో అతి పెద్ద చెరువుగా గుర్తింపు తెచ్చుకుంది.

నిత్యం జలకళతో గణపసముద్రం

కాకతీయులు గణపురంను గణపవరం పట్టణంగా నామకరణం చేశాక ఇక్కడి ప్రజల కోసం కరవుకాటకాలు రాకుండా జిల్లాలోనే భారీ చెరువుల్లో ఒక్కటిగా పేరుగాంచిన గణప సముద్రంను నిర్మించారు. ఇది ప్రస్తుతం ప్రకృతి అందాలకు నిలయం.. ఎక్కడా లేనివిధంగా ఈ చెరువుకు 30 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవుతో మత్తడి ఉంటుంది. చెరువు నిండాక మత్తడి పోస్తుంటే అంత ఎత్తు నుంచి జాలువారే జల ప్రవాహం కనుల విందుగా ఉంటుంది. చెరువు గట్టుపై ఓవైపు దక్షిణముఖ హనుమాన్‌ ఆలయం సైతం ఉంది. ఇక్కడ వినాయకుడి గుడిని నిర్మించిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఆ ఆలయం కాల గర్భంలో కలిసి పోయింది. ఈ చెరువు వల్లనే గణపురం మండలవాసులు అనేక మంది రైతులుగా మారి పంటలు పండిస్తున్నారు. 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల వారికీ సాగు నీరందిస్తుంది. దీంతో సుమారు వెయ్యి మంది మత్స్యకారుల కుటుంబాలు బతుకుతున్నాయి. ఆంతేకాకుండా నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలకు మిషన్‌ భగీరథ నీరు అందుతోంది.

ఎక్కడా లేని గుహలు

మండలంలోని మైలారం అటవీ ప్రాంతంలో నల్లగుట్ట ఉంది. ఇందులో సహజ సిద్ధంగా గుహలున్నాయి. ఇవి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని పురావస్తు, పర్యాటక శాఖ చేపట్టిన సర్వేలో తేలింది. దీన్ని అప్పటి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అప్పట్లో అభివృద్ధిలోకి తెస్తానని మాటిచ్చారు. ఆ మేరకు పురావస్తు శాఖ అభివృద్ధికి కావాల్సిన అంచనా వ్యయాన్ని తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఇందులో ఆదిమానవులు నివసించేవారని సంబంధిత శాఖాధికారులు అంటున్నారు. గుహ మొత్తం అనేక దారులతో నిండి ఉంటుంది. మధ్య, మధ్యలో అందమైన ఆకారంలో సహజసిద్ధంగా ఏర్పడ్డ శిలలు అబ్బురపరుస్తాయి. మైలారం గ్రామం వెనుకాల రేగొండ మండలం బాగిర్థిపేట గ్రామం దాకా ఇవి విస్తరించి ఉంటాయి.

ఏకైక భారీ పరిశ్రమ కేటీపీపీ

జిల్లాలోనే భారీ పరిశ్రమ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం మొదటిదశ నుంచి 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నప్పటికీ రెండో దశ 600 మెగావాట్లు కూడా ఇది పూర్తి చేసుకుంది. మొత్తం దీని సామర్థ్యం 1100 మెగావాట్లకు చేరుకుంది. 999 ఎకరాల విస్తీర్ణంలో కేటీపీపీ ఉంది. ఈ భారీ పరిశ్రమతో ప్రత్యక్షంగా 3 వేల మంది, పరోక్షంగా అనేక మంది పలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక్కడికి గోదావరి జలాలు వస్తాయి. అదేవిధంగా ఇందులోని చిట్టయ్యకుంటను గోదావరి జలాలతో నింపి దీన్ని మినీ ట్యాంక్‌ బండ్‌లా మార్చారు. ఇంజినీర్లు, ఉద్యోగులు ఇక్కడ వాకింగ్‌ చేస్తారు. రాత్రి పూట అందమైన విద్యుద్దీపాలంకరణతో దేదీప్య మానంగా వెలుగుతుంది. ఎత్తైన భవనాలు, సుందరమైన ఆకృతులు, విస్తారంగా ఉన్న రహదారులు మైమరింపజేస్తాయి. ఇది చూడదగ్గ ప్రదేశంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది.

శిల్పకళకు నెలవు కోటగుళ్లు

11-12వ శతాబ్దపు మధ్యకాలంలో గణపురంను కాకతీయులు సామంత రాజ్యంగా చేసుకొని పాలించారు. గణపతిదేవ చక్రవర్తి ఇక్కడి వనరులను చూసి దీన్ని పెద్ద పట్టణంగా అప్పట్లో తీర్చిదిద్దారు. రేచర్ల రుద్రుడు దీన్ని సామంతరాజుగా పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. కోటగుళ్లలో అరుదైన శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక గర్భగుడితో పాటు సభా మండపం, కళ్యాణ మండపాలున్నాయి. ఈ ఆలయం చుట్టూ 16 ఉప ఆలయాలుండడం విశేషం.. కాకతీయులు నిర్మించిన ఆలయాల్లో ఎక్కడా ప్రధాన ఆలయం చుట్టూ ఉప ఆలయాలు లేవు. ఈ ఒక్కో ఉప ఆలయంలో ఒక్కో శివలింగాన్ని, ప్రధాన ఆలయంలో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవాలయం అంటే రుద్రమదేవికి ఎంతో ఇష్టం అంటారు. ఆమె అనేక రాజ్యాలపై దండెత్తి విజయం సాధించాక ఆమెకు లభించిన ‘గజ కేసరి’ బిరుదు చిహ్నాలను ఇక్కడ అనేక చోట్ల ఆలయం పైన, ప్రదక్షిణ పథం చుట్టూ ఏర్పాటు చేశారు. కాకతీయుల పాలన అంతమవుతున్న రోజుల్లో అప్పటి ముస్లిం రాజులు దండెత్తి కోటగుళ్లను ధ్వంసం చేశారు. కోటగుళ్లు కొంతమేర దెబ్బతిన్నా ఇప్పటికీ శిల్ప కళా సంపదతో కళకళలాడుతోంది. అందుకే ఇక్కడికి పర్యాటకులు వస్తారు. పర్యాటకుల విడిది కోసం ఏడేళ్ల క్రితం పర్యాటక శాఖ ఇక్కడ హరిత హోటల్‌ను నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు