logo

గ్రామాన్ని ఖాళీ చేయం

గూడురు మండలం దొరవారితిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేస్తే వేరేచోట అన్ని సౌకర్యాలు సమకూర్చి ఆవాసయోగ్యం కల్పిస్తామని అధికారులు చెప్పినా పల్లెను వదిలి రాలేమని స్థానికులు స్పష్ఠం చేశారు

Published : 29 Jan 2023 06:30 IST

అధికారులతో దొరవారితిమ్మాపురం గ్రామస్థులు

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో కొమురయ్య, చిత్రంలో తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌

కొత్తగూడ, న్యూస్‌టుడే: గూడురు మండలం దొరవారితిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేస్తే వేరేచోట అన్ని సౌకర్యాలు సమకూర్చి ఆవాసయోగ్యం కల్పిస్తామని అధికారులు చెప్పినా పల్లెను వదిలి రాలేమని స్థానికులు స్పష్ఠం చేశారు. శనివారం అధికార యంత్రాంగం గ్రామంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో కొమురయ్య, ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎస్సై దిలీప్‌ గ్రామస్థులతో మాట్లాడారు. అటవీ ప్రాంతంలోని దొరవారితిమ్మాపురం గిరిజన గ్రామం నుంచి వచ్చేయాలని గతంలో అధికారులు స్థానికులను కోరారు. ఖాళీ చేయకపోవడంతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. గ్రామం నుంచి వస్తే ఇతర గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు చెప్పారు. అయినప్పటికీ గ్రామస్థులు ఒప్పుకోకపోవడంతో విద్యుత్తు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరాను నిలిపేసినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రముఖులు ధన్సరి రమేశ్‌, పెన్క బుచ్చిరాములతోపాటు స్థానికులు మాట్లాడుతూ విద్యుత్తు సరఫరా లేకున్నప్పటికీ ఇక్కడే జీవిస్తామని తేల్చిచెప్పారు. గతంలో ఎలాంటి సౌకర్యాల్లేనప్పుడు కూడా దీపాలు పెట్టుకుని జీవించామని అదేమీ మాకు కొత్త కాదని అధికారులతో అన్నారు. గ్రామం ఖాళీకి గ్రామస్థులు ఎంతకు వినకపోవడంతో అధికారులు వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు