logo

పెరిగిన గిరాకీ.. తగ్గిన సరఫరా

అప్రకటిత కరెంటు కోతలతో కళ్లెదుటే పచ్చని పంట చేలు ఎండిపోతుంటే అన్నదాతల రగిలిపోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని కదం తొక్కుతున్నారు.

Published : 30 Jan 2023 05:18 IST

మోటార్లకు కరెంటు  అందక రైతుల వెతలు

నెక్కొండ మండలం అలంఖానిపేటలో సాగు నీరందక వాడిపోతున్న మొక్కజొన్న చేను

నర్సంపేట, న్యూస్‌టుడే: అప్రకటిత కరెంటు కోతలతో కళ్లెదుటే పచ్చని పంట చేలు ఎండిపోతుంటే అన్నదాతల రగిలిపోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని కదం తొక్కుతున్నారు. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. గడిచిన ఇరవై రోజుల నుంచి విద్యుత్తు సమస్యలు ఎదురవుతుండగా.. స్థానిక అధికారులు చెబుతున్న జవాబుకు భిన్నంగా కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. 24 గంటల సరఫరా దేవుడెరుగు.. నాణ్యమైన కరెంటు 12 గంటలు ఇవ్వండంటున్న హలధారుల మొరను ఆలకించే నాథులే కరవయ్యారు.

విద్యుదుత్పత్తి తగ్గినందునే..: గ్రిడ్‌లో తలెత్తిన సమస్య కారణంగానే విద్యుత్తు సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. కరెంటు ఉత్పత్తి తగ్గడం వల్లే వినియోగానికి సరిపడా కరెంటు సరఫరా కావడం లేదని చెబుతున్నారు. వ్యవసాయ మోటార్లకు గత ఇరవై రోజుల నుంచి పట్టుమని పది గంటలు కూడా సక్రమంగా కరెంటు రావడం లేదని వివిధ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం వ్యవసాయ రంగానికి ఎలాంటి కోతల్లేవని షిఫ్టు పద్ధతిలో సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ సరఫరా ఉన్నా మోటారు ఆన్‌ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కరెంటు పోతోందని బుచ్చినాయక్‌తండా, మహేశ్వరం, మూడుచెక్కలపల్లి గ్రామాల రైతులు తెలిపారు. నర్సంపేట డివిజన్‌లో మొత్తం 27 విద్యుత్తు సబ్‌ స్టేషన్లుండగా అన్నింటి పరిధిలో కరెంటు కోతలున్నట్లు ఆయా గ్రామాల రైతులు చెప్పారు. గతంతో పోలిస్తే పంటల విస్తీర్ణం కూడా పెద్దగా పెరిగిందేమీ లేదని వ్యవసాయ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం డివిజన్‌లో త్రీఫేజ్‌కు 80 మెగా వాట్స్‌ లోడ్‌ ఇస్తున్నామని సింగిల్‌ ఫేజ్‌కు 25 మెగావాట్స్‌ సరఫరా చేస్తున్నట్లు డిస్కం అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే సరఫరాకు, డిమాండ్‌కు మధ్య 30 శాతం లోడింగ్‌ తక్కువగా ఉన్నట్లు సమాచారం.

గ్రామాల్లో ఆందోళనలు: అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని, నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని డిమాండ్‌తో డివిజన్‌ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. బిల్లుల వసూలు కోసం వచ్చిన ఉద్యోగిని నల్లబెల్లి మండలం కొండాయిలుపల్లి రైతులు గదిలో శనివారం నిర్భందించారు. ఆదివారం భాజపా ఆధ్వర్యంలో  ధర్నా చేశారు. నెక్కొండ మండలం అలంఖానిపేటలో రైతులు ఆందోళన చేశారు.

మొక్కజొన్న ఎండిపోతోంది
- సొల్లేటి రవి, అలంఖానిపేట

పక్షం రోజుల నుంచి కరెంటు కోతలతో మొక్కజొన్న చేలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. అప్రకటిత కోతలతో కరెంటు మోటార్లు నడవడం లేదు. రాత్రి వేళ కరెంటు ఇవ్వడంతో బావుల వద్ద నిద్రిస్తున్నాం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో జాగారం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని