logo

గుడిసెల దహనం.. ఉద్రిక్తత

ఉద్రిక్తతల మధ్య ప్రభుత్వ భూమిలో పేదలు వేసిన గుడిసెలను అధికారులు తొలగించారు. నర్సంపేట పట్టణ శివారు సర్వే నంబరు 62లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో వందలాది మంది ఇళ్లు లేని పేదలు ఆదివారం ఉదయాన్నే తరలి వచ్చి కర్రలు, బొంగులకు చీరలు కట్టి గుడిసెలు వేశారు.

Published : 30 Jan 2023 05:18 IST

ప్రభుత్వ భూమిలో వేసిన గుడిసెలను దహనం చేస్తున అధికారులు

నర్సంపేట, న్యూస్‌టుడే: ఉద్రిక్తతల మధ్య ప్రభుత్వ భూమిలో పేదలు వేసిన గుడిసెలను అధికారులు తొలగించారు. నర్సంపేట పట్టణ శివారు సర్వే నంబరు 62లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో వందలాది మంది ఇళ్లు లేని పేదలు ఆదివారం ఉదయాన్నే తరలి వచ్చి కర్రలు, బొంగులకు చీరలు కట్టి గుడిసెలు వేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది నర్సంపేట సీఐ రమేశ్‌, ఎస్సైలు రవీందర్‌, సురేశ్‌, పోలీసులతో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే పలువురు గుడిసెలు వేయగా ఎంసీపీఐయూ నాయకులు కన్నం వెంకన్న, వంగాల రాగసుధతో  సీఐ రమేశ్‌ మాట్లాడి గుడిసెలు తొలగించి ఇక్కడకు నుంచి వెళ్లాలని చెప్పినా వినలేదు. ఒక పక్క పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తుంటే నాయకులు వెంకన్న, రాగసుధ మాట్లాడుతూ అధికారులు ఇబ్బందులు పెట్టినా బెదరకుండా ఉండాలని పేదలకు సూచించారు. పేదలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశంతో నర్సంపేట డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి అధికారులను, సిబ్బందిని, మహిళా పోలీసులను రప్పించారు. తహసీల్దార్‌ రామ్మూర్తి వచ్చి భూమిని ఖాళీ చేసి వెళ్లాలని లేదంటే కేసులవుతాయని చెప్పినా వినిపించుకోలేదు. నర్సంపేట, నర్సంపేట రూరల్‌, నెక్కొండ సీఐలు రమేశ్‌, సూర్యప్రసాద్‌, హథీరామ్‌ నేతృత్వంలో నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నెక్కొండ చెన్నారావుపేట, నల్లబెల్లి ఎస్సైలు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పథకం ప్రకారం ఒక్కసారి దాడి చేసి గుడిసెలను తొలగింపు చేపట్టారు. పోలీసులు వెంకన్న, రాగసుధను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అక్కడకు వచ్చిన పేదలంతా వెళ్లి పోయారు. అనంతరం పేదలు వేసిన గుడిసెలను దహనం చేశారు.


తరలి వచ్చిన పేదలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని