logo

Crime News: నాన్నా.. వెళ్తున్నా!

నాన్నా.. పెళ్లికి పరకాల వెళ్తున్నానని.. చెప్పి వెళ్లిన గుండా వినోద్‌రెడ్డి(29) అంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం అన్నారం బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది.

Updated : 30 Jan 2023 08:59 IST

కాల్వలో దూకి యువకుడి ఆత్మహత్య

వినోద్‌రెడ్డి

కాళేశ్వరం, న్యూస్‌టుడే : నాన్నా.. పెళ్లికి పరకాల వెళ్తున్నానని.. చెప్పి వెళ్లిన గుండా వినోద్‌రెడ్డి(29) అంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం అన్నారం బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఇటీవలే పెళ్లి సంబంధం మాట్లాడుకున్నామని.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని సంఘటన స్థలంలో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం మందపురానికి చెందిన గుండా తిరుపతిరెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దకుమారుడు చెన్నూర్‌లో నివాసం ఉంటుండగా సింగరేణి ఉద్యోగ రీత్యా తండ్రి భూపాలపల్లిలో ఉంటున్నారు. చిన్న కుమారుడు వినోద్‌రెడ్డి హైదరాబాద్‌లో మెడికల్‌ రిప్‌గా ఉద్యోగం చేస్తున్నారు. భూపాలపల్లి వచ్చిన ఆయన శనివారం ఉదయం 10 గంటలకు పెళ్లికి పరకాల వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పాడు. కాళేశ్వరం గ్రావిటీ కాల్వ రహదారిపై కారును నిలిపి.. తాళం చెవి, చరవాణి అక్కడే వదిలేసి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రాంత ప్రజలు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఓ యువతితో వివాహం చేయడానికి సంబంధం మాట్లాడుకోగా ఇటీవల ఆ యువతి పెళ్లికి నిరాకరించిందని, దీంతో యువకుడు మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం జాలర్లతో గాలింపు చేపట్టగా సాయంత్రం మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్‌ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అన్నారం బ్యారేజీ వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని