logo

గ్రామం నిండా.. బూడిద ట్యాంకర్లే!

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా బూడిద లారీలే.. దాదాపు రెండిళ్లకు ఒకటి చొప్పున ఉంటాయి. థర్మల్‌ కేంద్రంతో భూములు కోల్పోయిన రైతులు ట్యాంకర్లను కొనుగోలు చేసి బూడిద వ్యాపారం చేస్తుండగా.. పరోక్షంగా 100 మందికి పైగా డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి పొందుతున్నారు.

Updated : 30 Jan 2023 05:44 IST

స్వయం ఉపాధి బాటలో దుబ్బపల్లి వాసులు
న్యూస్‌టుడే, గణపురం (భూపాలపల్లి జిల్లా)

దుబ్బపల్లి రోడ్డులో బారులు తీరిన బూడిద లారీలు

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా బూడిద లారీలే.. దాదాపు రెండిళ్లకు ఒకటి చొప్పున ఉంటాయి. థర్మల్‌ కేంద్రంతో భూములు కోల్పోయిన రైతులు ట్యాంకర్లను కొనుగోలు చేసి బూడిద వ్యాపారం చేస్తుండగా.. పరోక్షంగా 100 మందికి పైగా డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి పొందుతున్నారు.. దీంతో గణపురం మండలం చెల్పూరు శివారు దుబ్బపల్లి గ్రామంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామం ఒకప్పుడు వ్యవసాయ ఆధారితం.. ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకునేవారు.. ఇప్పుడంతా మారింది.. రైతులు కాస్తా వ్యాపారులుగా మారారు. పలుగు పార పట్టుకునే చేతులతో స్టీరింగ్‌ పట్టుకుంటున్నారు. బూడిద వ్యాపారం చేస్తూ లాభాలతో దినదినాభివృద్ధి చెందుతున్నారు. గ్రామంలో 297 కుటుంబాలుంటే.. 94 బూడిద లారీలు ఉన్నాయి. పదికి పైగా టిప్పర్లు ఉన్నాయి. 2006 ముందుకు పూర్తి వ్యవసాయ గ్రామమైన దుబ్బపల్లికి పేరుకు తగ్గట్లే.. ఆ గ్రామానికి దుబ్బరోడ్డే ఉండేది.. అంతర్గత రహదారులు సైతం ఉండేవి కావు.. అప్పటి ఏపీ జెన్‌కో చెల్పూరు శివారు దుబ్బపల్లి గ్రామంపై కన్నేసింది. ఇక్కడ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి 997 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేేసింది. పరిహారం, నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చింది. కొంతమంది తమ వ్యవసాయ భూములు అమ్మగా వచ్చిన పెద్ద మొత్తంతో లక్షలాది రూపాయలు వెచ్చించి బూడిద లారీలు కొనుగోలు చేశారు.

ఇతర ప్రాంతాలకు తరలిస్తూ..

కేటీపీపీ బూడిదను సిమెంటు, బూడిద ఇటుకల కర్మాగారాలు, రెడ్‌మిక్స్‌ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. రవాణాకు స్థానికంగా ఉండే బూడిద లారీలనే వాడాలనే నిబంధన ఉండడంతో బూడిద తరలింపు ఇక్కడి వారికి మంచి వ్యాపారంగా మారింది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని కోదాడ, తాండూరు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కంపెనీలకు తరలిస్తారు. ఇలా రోజులో సుమారు వంద ట్యాంకర్ల బూడిదను తరలిస్తారు. కేటీపీపీలోని సైలో కేంద్రాల వద్ద బూడిద లోడింగ్‌ను కేటీపీపీ సిబ్బంది చేస్తారు. లారీల యజమానులంతా కలిసి సంఘం ఏర్పాటు చేసుకున్నారు. దుబ్బపల్లి రోడ్డు పక్కన ఓ శాశ్వత భవనాన్ని సైతం నిర్మించుకున్నారు. ఏటా ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకుంటారు.

పన్నులు రద్దు చేస్తే మేలు..
- ముకిరాల తిరుపతిరావు, బల్కర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, దుబ్బపల్లి

మేము థర్మల్‌ కేంద్రానికి వ్యవసాయ భూములన్నీ ఇచ్చేశాం.. చేయడానికి ఏం పని లేక బూడిద వ్యాపారం చేసుకుంటున్నాం. బాగానే ఉంది.. అయితే బూడిద రవాణాకు ప్రభుత్వం రోడ్డు పన్నులు విపరీతంగా పెంచింది. వాటిని రద్దు చేయాలి.

పలువురు ఉపాధి పొందుతున్నారు
- లింగంపెల్లి నర్సింగరావు, దుబ్బపల్లి

మా లారీలతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు గ్రామంలో ఎక్కువయ్యారు. డ్రైవింగ్‌ నేర్చుకోవాలనే తలంపుతో యువకులు క్లీనర్లుగా వాటి వెంట వెళ్తున్నారు. నిరుద్యోగులు అనేక మంది ఉపాధి పొందుతుండడం సంతోషంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు