logo

మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఏదీ?

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల అనుసంధాన పథకం, స్త్రీనిధి, పొదుపు నిధి నుంచి రుణాలు ఇస్తున్నారు.

Published : 30 Jan 2023 05:18 IST

మూడేళ్లుగా ఎదురు చూపులు

సమావేశంలో పాల్గొన్న మెప్మా మహిళా సంఘాల సభ్యులు (పాతచిత్రం)

జనగామ, న్యూస్‌టుడే: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల అనుసంధాన పథకం, స్త్రీనిధి, పొదుపు నిధి నుంచి రుణాలు ఇస్తున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా తొలుత పావలా వడ్డీకి రుణాలు అందజేశారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణ (వీఎల్‌ఆర్‌) పథకాన్ని 2015-16 నుంచి అమలు చేస్తున్నారు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించిన పొదుపు సంఘాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించింది. చెల్లించిన వడ్డీని తిరిగి బ్యాంకుల ద్వారా వారి ఖాతాలకు జమ చేయడం ఈ పథకం ఉద్దేశం. జనగామ పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు మూడేళ్లుగా వడ్డీ రాయితీ రావడం లేదు. దీంతో సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొదుపు.. రుణాలే ఉపాధిగా..

పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ప్రభుత్వపరమైన ఉపాధి అవకాశాలు ఉండవు. దీంతో వారు నిర్మాణ రంగం, దుకాణాలు, ఇళ్లలో పనులు, చిరు, వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పట్టణలోని పేద మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా పలు పథకాలు అమలవుతున్నాయి. బ్యాంకులు, ఇతర పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారు.

తిరకాసులు..తిప్పలు: పొదుపు సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ అందజేసేందుకు తిరకాసులు ఉన్నాయి. క్రమం తప్పకుండా నెలవారీ కిస్తులు చెల్లించాలి. రుణంతో పాటు నిర్దేశిత వడ్డీని సకాలంలో చెల్లించాలి.  రూ.100కు 80 పైసల నుంచి రూపాయి వరకు వడ్డీ  చెల్లిస్తున్నామని మహిళలు అంటున్నారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించింనప్పుడు ఆర్నెల్లలోపు వారి ఖాతాలకు వడ్డీ రాయితీ సొమ్మును జమ చేయాల్సి ఉంది. ఒకటి, రెండు మాసాలు ఆలస్యంగా చెల్లించినా రాయితీ అందని పరిస్థితులు ఉన్నాయి.

* జనగామ మున్సిపల్‌ పరిధిలో గత డిసెంబరు నివేదికను అనుసరించి 934 పొదుపు సంఘాలు, 35 వార్డు కమిటీలు, ఒక పట్టణ కమిటీ పరిధిలో సుమారు 9 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పొదుపు, రుణ స్వీకరణ, చెల్లింపుల కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయి. 2015-16 నుంచి 2022 వరకు గణాంకాలను పరిశీలిస్తే, నానాటికీ వడ్డీ రాయితీ పొందే సంఘాల సంఖ్య తగ్గిపోతుండటం గమనార్హం.

ఎందుకీ తరుగుదల ?  

2015-16 నుంచి 2018-19 వరకు 900 సంఘాలకు గాను 500 పైగా సంఘాలకు వడ్డీ రాయితీ లభించింది. గత రెండేళ్ల లెక్కలను పరిశీలిస్తే 200 లోపు సంఘాలు మాత్రమే రాయితీ పొందేందుకు అర్హత సాధించాయి. జనగామలో రూ.20 లక్షల వరకు అప్పు తీసుకుంటున్న సంఘాలున్నాయి. రూ.7.50 లక్షల వరకు బ్యాంకు లోన్‌ తీసుకొని సక్రమంగా చెల్లించిన సంఘాలకే వడ్డీ రాయితీ వర్తిస్తుందంటున్నారు. దీంతో పేద మహిళలు అధిక రుణం తీసుకొని, అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.

అన్ని గ్రూపులకు వర్తింపజేయాలి
- ఆకుల సరిత, మెప్మా జనగామ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు

2019-20 నుంచి వడ్డీ రాయితీ రావడం లేదు. ఎంత రుణం తీసుకున్నా వడ్డీరాయితీ పథకాన్ని వర్తింపజేయాలి. వెంటనే బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రతిపాదన పంపించాం
- రాజేందర్‌, పట్టణ మెప్మా అధికారి

ఎన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ వర్తిస్తుందనేది మా పరిధిలో ఉండదు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించే వారి వివరాలను మెప్మా ప్రధాన కార్యాలయం పర్యవేక్షిస్తుంది. అక్కడి నుంచే రాయితీకి అర్హత కలిగిన సంఘాల వివరాలు వస్తాయి. బకాయిల వివరాలతో ప్రతిపాదన పంపించాము. నిధులు వస్తే నేరుగా వారి ఖాతాలకు జమ అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని