logo

‘ప్రజా సమస్యలు విస్మరించిన ఎమ్మెల్యే’

భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర ఇంత వరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు.

Published : 30 Jan 2023 05:18 IST

కృష్ణాకాలనీలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే : భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర ఇంత వరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. ‘హత్‌ సే హాత్‌ జోడో యాత్ర’ లో భాగంగా నాలుగో రోజు ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌, కారల్‌మార్క్స్‌కాలనీ, యాదవకాలనీ, కృష్ణాకాలనీ, టీ2 మాదిరి క్వార్టర్లు, జవహర్‌నగర్‌కాలనీ, జయశంకర్‌, సత్తార్‌నగర్‌, హైటెక్‌ కాలనీల్లో యాత్ర కొనసాగించారు. యాత్రకు ముందుగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు కాలనీల్లో మహిళలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పలు కార్మిక కాలనీల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండాలను ఎగురవేశారు. ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటు సమస్యలు జీఎస్సార్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కృష్ణాకాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎస్సార్‌ మాట్లాడుతూ.. గోదావరి జలాలు తలాపునే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని అందించ లేదని, పట్టణంలోని ప్రధాన రహదారిపై ఇసుక, బొగ్గు లారీలు తిరగడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పట్టణ ప్రజల సౌకర్యం కోసం రింగ్‌రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని, కార్మిక కుటుంబాలకు సరైన వైద్యం అందకపోవడంతో వారు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సరోజన, దాట్ల శ్రీను, నాయకులు దేవన్‌, చల్లూరి మధు, బుర్ర కొంరయ్య, సంతోష్‌, కరుణాకర్‌, రాజేందర్‌, రాజన్న, పాజిల్‌, రాజేష్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని