logo

ఉబికి వచ్చిన.. పాతాళ గంగ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి.

Published : 30 Jan 2023 05:18 IST

ఫీజోమీటర్‌ సహాయంతో భూగర్భ జలాలను లెక్కిస్తున్న అధికారులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. ముఖ్యంగా గత జులై, ఆగస్టులో వానలు దంచికొట్టడంతో చెరువులు, కుంటలు, ఇతర నీటి నిల్వ కేంద్రాలు పొంగి పొర్లాయి. దీంతో జిల్లా అంతటా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళతో ఆకట్టుకుంటున్నాయి. బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పెరగడంతో అన్నదాతలకు యాసంగి పంటల సాగుకు ఎలాంటి ఢోకా ఉండదనే ఆనందంలో రైతులు ఉన్నారు. నీరు సరిపడా ఉందని అవసరానికి మించి వృథా చేయకుండా పొదుపు చర్యలు చేపట్టాలని భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌

సగటున 7.26 మీటర్ల లోతు..

గత జనవరిలో 9.44 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా ఈ సారి ఇదే నెలలో భూగర్భ జలం సరాసరి 7.26 మీటర్ల లోతులో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో 2.18 మీటర్ల పైన పాతాళ గంగ ఉంది. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభం జూన్‌లో వర్షాల ప్రభావం అంతగా లేదు. దీంతో పంటలను సాగు చేసేందుకు అన్నదాతలు ఆలోచనలో పడ్డారు. జులై మొదటివారానికి వచ్చేసరికి మాత్రం కుంభవృష్టి కురవడంతో జిల్లావ్యాప్తంగా బావులు, బోరుబావుల్లో నీటి మట్టాలు పెరిగిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో భూగర్భ జలాలు పెరిగిపోయాయి.

సంరక్షించుకోవాలి

ప్రస్తుతం నీటి నిల్వలను గమనిస్తే జిల్లాలో కాస్త ఫర్వాలేదనే కోణంలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. యాసంగి పంటలకు సరిపడా నీరుంది కదా అని అవసరానికి మించి వినియోగించడంతో వచ్చే వేసవి వరకు తీవ్ర స్థాయిలో జలాలు అడుగంటే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు తక్కువ నీటి వినియోగమయ్యే ఆరుతడి పంటలను పండించేందుకు మొగ్గు చూపాలి. ప్రభుత్వం నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నందున ఇష్టానుసారంగా బోర్ల నుంచి నీటిని తోడేస్తున్నారు.

తక్కువ నీటి వినియోగం పంటలు వేయాలి
- శ్రీనివాసరావు, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి, జయశంకర్‌ భూపాలపల్లి

జిల్లాలో ప్రతి నెలా భూగర్భ జలాల నిల్వలను అంచనా వేస్తుంటాం. ఈ యాసంగి పంటలకు సంబంధించి గతంతో పోలిస్తే వానాకాలంలో అధిక వర్షాలు కురవడంతో భూగర్భ జల మట్టాలు అమాంతం పెరిగిపోయాయి. నీటిని ఇష్టారీతిన వినియోగించకుండా యాసంగిలో ఆరుతడి పంటలను వేయడంతో పాటు ప్రతి రైతు పంట భూముల్లో పాంపాండ్స్‌, చెక్‌డ్యాంలు నిర్మించుకోవాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని