logo

త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది శుభ పరిణామమే అయినప్పటికీ.. అందులోని ఒక వర్గం ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

Published : 30 Jan 2023 05:18 IST

ములుగు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది శుభ పరిణామమే అయినప్పటికీ.. అందులోని ఒక వర్గం ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. బదిలీలు, పదోన్నతులనేవి అందరికి వర్తించాల్సి ఉండగా భాషా పండితులకు మాత్రం వర్తించడం లేదు. 2015 తర్వాత బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ విషయంలో భాషా పండితులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టు కేసు ఉందనే సాకుతో ఈ సారి భాషా పండితుల పదోన్నతులు, బదిలీలను ప్రభుత్వం వాయిదా వేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అధికారికంగా ఎస్‌జీటీగా బోధన చేస్తున్న భాషా పండితులు ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

* 317 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయుల సమస్య మరొకటి. బదిలీ అయిన జిల్లాకు వచ్చే సరికి వారు ఎంత సర్వీసు ఉన్నా పూర్తిగా సీనియారిటీని కోల్పోయారు. వారి సీనియారిటీ మొదటికి వచ్చింది. దీంతో బదిలీల్లో ప్రాధాన్యతను కొల్పోయే పరిస్థితి నెలకొంది. వీరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కొందరి ఉపాధ్యాయుల వాదన. ఈ సమస్య ప్రధానంగా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఉంది.

* పీఈటీల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పదోన్నతులు లేకుండా పోయాయి. ఎన్నేళ్లు పని చేసినా ఎస్‌జీటీ స్థాయిలోనే ఉంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వారికి పదోన్నత కల్పించాలనేది ప్రధాన డిమాండు. పీఈటీలు ప్రస్తుతం గ్రేడు 2 కింద ఎస్జీటీగా పని చేస్తున్నారు. ఆ పోస్టును గ్రేడ్‌ 1గా ఉన్నతీకరించి స్కూలు అసిస్టెంటు స్థాయిలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించాలనే డిమాండు పీఈటీల నుంచి ఉంది.


బోధన నిలిపివేస్తాం
- హమీద్‌, భాషా పండితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి

భాషా పండితులకు పదోన్నతులు చేపట్టకుంటే ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు బోధన నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సంకేతం ఇచ్చాం. కోర్టు కేసు ఉందనే సాకుతో పదోన్నతులు నిలిపివేయడం సమంజసం కాదు.

రాజకీయ పలుకుబడితో..
- ఏళ్ల మధుసుదన్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలి. జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలి. స్పౌజ్‌ బదిలీలు చేయాలి. బదిలీలను అపహాస్యం చేస్తూ రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలి. కనీస రెండేళ్లు కాకుండా జీరో సర్వీసుకు అనుమతిస్తూ.. పారదర్శకంగా బదిలీలను నిర్వహించాలి.

స్పౌజ్‌ ఉత్తర్వులు విడుదల చేయాలి
- వాసుదేవరెడ్డి, యూటీఎఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి

317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన వారిని సొంత ప్రాంతాలకు పంపించాలి. పండిట్‌, పీఈటీల అక్రిడేషన్‌ పదోన్నతులు ఇవ్వాలి. 317 జీవోను రద్దు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్‌ పద్ధతిలో పదోన్నతులు కల్పించాలి. ఎస్‌జీటీ, భాషా పండితులకు స్పౌజ్‌ ఉత్తర్వులు విడుదల చేయాలి.

పాత పద్ధతి అనుసరిస్తే మేలు
- హట్కర్‌ సమ్మయ్య, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

రోస్టర్‌ పద్ధతి పాటించకపోవడంతో లోకల్‌ బాడీలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది. గతంలో ఏజెన్సీలో పని చేస్తున్న ఎస్టీ ఉపాధ్యాయులకు, లోకల్‌బాడీలో పని చేస్తున్న ఎస్టీ ఉపాధ్యాయులకు వేర్వేరుగా పదోన్నతులు ఇచ్చారు. ఏజెన్సీలో పని చేసే వారికి త్వరగా పదోన్నతి వచ్చింది. ప్రస్తుత ప్రక్రియతో ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. పాత పద్ధతిలో పదోన్నతులు కల్పించాలి.


నిబంధనల ప్రకారమే..:  సుదర్శన్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ కో-ఆర్డినేటర్‌

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. 317 జీవోలో బదిలీ అయి వచ్చిన వారికి అవకాశం లేదు. కనీసం మూడేళ్ల సీనియారిటీ ఉండాలి. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే పదోన్నతులు, బదిలీలు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని