logo

సారూ.. ఓరుగల్లు కోరుతోంది..!

ఓరుగల్లు నగరాభివృద్ధికి అనేక అడుగులు పడాల్సి ఉంది. నగరం రూపురేఖలు మార్చి ప్రజలకు స్మార్ట్‌ సేవలను చేరువ చేసేందుకు అమలవుతున్న ‘ఆకర్షణీయ పథకం’ (స్మార్ట్‌ సిటీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

Updated : 31 Jan 2023 06:44 IST

నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

ఈనాడు, వరంగల్‌, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఓరుగల్లు నగరాభివృద్ధికి అనేక అడుగులు పడాల్సి ఉంది. నగరం రూపురేఖలు మార్చి ప్రజలకు స్మార్ట్‌ సేవలను చేరువ చేసేందుకు అమలవుతున్న ‘ఆకర్షణీయ పథకం’ (స్మార్ట్‌ సిటీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మంగళవారం పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. జిల్లాకు మంత్రి వస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.

పర్యటన సాగుతుందిలా....

* ఉదయం 11 గంటలు: కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో కమలాపూర్‌ మండలం గూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని హెలిప్యాడ్‌ స్థలానికి చేరుకుంటారు.
* 11 నుంచి 12 వరకు: రూ.2.71 కోట్లతో నిర్మించే కమలాపూర్‌ బస్టాండ్‌ నిర్మాణానికి, కుల సంఘాల కమ్యూనిటీ  భవనాల సముదాయానికి శంకుస్థాపన, పెద్దమ్మగుడి, మార్కండేయ గుడి, శంకుస్థాపన చేస్తారు.
*  మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు:  వివిధ కుల సంఘాలకు ఒకే దగ్గర నిర్మాణం చేపట్టిన కుల సంఘాల కమ్యూనిటీ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
* 12.30 నుంచి 2 వరకు: మహాత్మా జ్యోతిబా ఫులే బాలబాలికల గురుకుల పాఠశాలల భవనాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం చేస్తారు.
*    2 గంటల తరువాత..కమలాపూర్‌ నుంచి రహదారి మార్గం గుండా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్తారు.
న్యూస్‌టుడే, కమలాపూర్‌


రెండేళ్లు గడిచినా

ఓరుగల్లు నగరంలో అమృత్‌ పథకాన్ని రూ.610 కోట్లతో చేపట్టారు. ఈ పథకాన్ని మిషన్‌ భగీరథకు అనుసంధానించి 2021 ఉగాది నుంచి నగరంలో ప్రతి రోజూ తాగునీటిని విడుదల చేస్తామని మహానగరపాలక సంస్థ ప్రకటించింది. తర్వాత కొన్ని రోజులు మాత్రమే తాగునీరు ప్రతి రోజూ సరఫరా చేశారు. తర్వాత రోజు విడిచి రోజు, అది కూడా సరఫరాలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని కాలనీలకు ఇప్పటికీ తాగు నీరు అందడం లేదు.
* ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసే అమృత్‌ పథకాన్ని 2021 ఏప్రిల్‌ 12న మంత్రి కేటీఆర్‌ రాంపూర్‌లో ప్రారంభించారు.

ఆకర్షణీయ నిధులు కావాలి

ఓరుగల్లుకు స్మార్ట్‌సిటీ పథకం 2016లో మంజూరైనా ఇప్పటికీ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. ఇందులో రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం రూ.193 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తన వాటాను ఇచ్చి యుటిలైజేషన్‌ ధ్రువపత్రం సమర్పిస్తేనే తన మిగిలిన వాటా ఇస్తానని తెగేసి చెప్పింది.
* నగరంలో స్మార్ట్‌సిటీ కింద ప్రారంభించిన పద్మాక్షి గుట్ట రోడ్డు, వరంగల్‌లో 11 స్మార్ట్‌ రోడ్ల పనులు ఆగాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెంటనే విడుదలయ్యేలా మంత్రి చొరవ చూపాల్సి ఉంది.
* గతేడాది మే 7న వరంగల్‌ నగరంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ వచ్చారు.

ఐటీ అంతంతే..

ప్రభుత్వం గతంలో ఓరుగల్లులో పలు ఐటీ కంపెనీలను ప్రారంభించింది.    హైదరాబాద్‌లో హైటెక్స్‌ తరహాలో ‘వైటెక్స్‌’ పేరుతో పదెకరాల్లో మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌, సాంస్కృతిక కేంద్రం వస్తుందని ప్రభుత్వం జీవో సైతం విడుదల చేసింది. కానీ దీనిపై అడుగులు ముందుకు పడడం లేదు.

శంకుస్థాపనకే పరిమితం

నగర రద్దీ నియంత్రణకు వరప్రదాయని అయిన ఇన్నర్‌ రింగు రోడ్డు పూర్తికి అడుగులు పడడం లేదు. ‘కుడా’ రూ.126 కోట్లతో భూసేకరణకు సిద్ధమైంది. ఆరేపల్లి, కొత్తపేట, ఎనుమాముల మార్కెట్, ధర్మారం, స్తంభంపల్లి శివారు, ధూపకుంట శివారు నుంచి రంగశాయిపేట ఖమ్మం రోడ్డు వరకు ఇన్నర్‌ రింగు రోడ్డు చేపట్టాలి.  

ఏవీ నియో పరుగులు?

కాజీపేట నుంచి వరంగల్‌ వరకు 15.5 కిలోమీటర్ల మేర రూ.998 కోట్లతో మెట్రో రైలుకు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 2021 మార్చిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపింది.   కొన్ని మార్పులు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను మరోమారు  పంపాలని తాము కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన  రాలేదని  కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌషల్‌ కిశోర్‌ గత నెలలో రాజ్యసభలో ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని