logo

ఘనంగా ఏర్పాట్లు.. పటిష్ఠ బందోబస్తు

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం హనుమకొండ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్‌ మండలంలో పర్యటించనున్నారు

Published : 31 Jan 2023 05:19 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి

కమలాపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం హనుమకొండ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్‌ మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

గురుకుల భవన నిర్మాణం అద్భుతం

తెలంగాణ ఏర్పడక ముందు వెనుకబడిన కులాలకు ప్రభుత్వాలు విద్యను అందజేయలేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కమలాపూర్‌ మండలం గూడూరు శివారులోని మంగళవారం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే మహాత్మాజ్యోతిబా ఫులేె బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గురుకుల భవనాల కట్టడం అద్భుతంగా ఉందని, దీన్ని చూసి బీసీ మంత్రిగా తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందన్నారు. బీసీ సంక్షేమ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టుతో చరవాణిలో మాట్లాడుతూ తరగతి గదుల్లో డిజిటల్‌లో ఆన్‌లైన్‌ క్లాస్‌ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, భారాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంజేపీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో రాంరెడ్డి, ఇంజినీరింగ్‌ ఈఈ నరేందర్‌ రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ రాణి, ఎంపీడీవో పల్లవి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సీపీ పరిశీలన..

గూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ స్థలంతో పాటు అభివృద్ధి పనులు ప్రారంభించే స్థలాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎంఏ.బారి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ రంగనాథ్‌ పరిశీలించారు. 300 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ.బొలిమల్ల సంజీవ్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని