logo

భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో..!

భూ సమస్యలను పరిష్కరించాలని కొందరు. అర్హులైన తమకు ఆసరా పింఛన్లు రావడం లేదని మరికొందరు. తమకు రక్షణ కల్పించాలని పలువురు. ఇలా అనేక సమస్యలు ప్రజావాణిలో వెల్లువెత్తాయి.

Updated : 31 Jan 2023 06:41 IST

ప్రజావాణిలో అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూశాఖవే

ప్రజావాణిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌
జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: భూ సమస్యలను పరిష్కరించాలని కొందరు. అర్హులైన తమకు ఆసరా పింఛన్లు రావడం లేదని మరికొందరు. తమకు రక్షణ కల్పించాలని పలువురు. ఇలా అనేక సమస్యలు ప్రజావాణిలో వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 55 దరఖాస్తులు రాగా రెవెన్యూశాఖవే 38 ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు కలుగుతుందోనని బాధితులు ఎదురుచూస్తున్నారు. మీదికొండ రైతులు ఏకంగా భూఅక్రమణల పై విచారణ చేపట్టాలని రైతులు బ్యానర్‌ను ప్రదర్శించి ఆవేదన తెలిపారు.

బతికే ఉన్నా..ఆసరాలో చంపేశారు

ఈయన పేరు ఓరుగంటి సూర్యనారాయణ. జనగామ పట్టణానికి చెందిన ఈయన అక్టోబర్‌ 11, 2021న వృద్ధాప్య పింఛన్‌ కోసం  ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఆగస్టు నెలలో విడుదల చేసిన  జాబితాలో ఈయన పేరు లేకపోవడంతో సంబంధిత అధికారులను ఆరా తీశారు. అతను మృతిచెందినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో ఆసరా పింఛన్‌కు దూరమయ్యాడు. రికార్డుల్లో తప్పుదొర్లిన దానిని సవరించాలంటూ గతంలో ప్రజావాణిలో విన్నవించినా పరిష్కారం జరగకపోవడంతో సోమవారం మరోమారు కలెక్టర్‌ను కలిశారు.

గ్రామసభలో ఉందన్నారు.. జాబితాలో తొలగించారు

ఈ చిత్రంలోని దంపతులు గోరంట్ల కుమారస్వామి, శోభ. వీరిది చిల్పూర్‌ మండలంలోని పల్లగుట్ట గ్రామం. రెండు పడకల ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందని పలుమార్లు గ్రామసభలో చెప్పిన అధికారులు ప్రస్తుత జాబితాలో పేరు లేకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించారు. దివ్యాంగుడైన గోరంట్ల కుమారస్వామి పింఛన్‌ కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కావడం లేదని వాపోయారు. నిరుపేదలమైన తమకు రెండు పడకల ఇళ్లు, ఆసరా పింఛన్‌ ఇప్పించాలంటూ మొర పెట్టుకున్నారు.

రక్షణ కల్పించాలని..

తమకు రక్షణ కల్పించి..తమ భూమి ఇతరుల వశం కాకుండా చూడాలంటూ దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన దండు మంజుల తన ముగ్గురు పిల్లలతో కలిసి ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, మధ్యవర్తులు తన భర్తను ప్రలోభాలకు గురిచేసి, తాగుడుకు బానిసను చేసి మాకు తెలియకుండా మోసపూరితంగా ఆయన పేరు మీదున్న కోట్ల విలువ చేసే 10 గుంటల భూమిని ధరణి పోర్టల్‌లో స్లాట్‌బుక్‌ చేసి అక్రమంగా భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. తమపై తీవ్రంగా దాడులు చేస్తున్నారని, రక్షణ కల్పించి..తమ భూమి అక్రమార్కుల వశం కాకుండా చూడాలని వేడుకున్నారు.

విచారణ చేసి న్యాయం చేయండి..

వీరు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండ గ్రామంలోని రైతులు. గ్రామ శివారులోని సర్వే.నెం:360లో సాగునీటి కాలువ నిర్మాణం కోసం పది మంది రైతులకు చెందిన 1.20 ఎకరాల భూమి కాలువ కింద వదులుకోవాల్సి వచ్చింది. వీరందరికి నష్టపరిహారం రావాల్సి ఉండగా ముగ్గురికే  వచ్చింది మిగతా వారికి వచ్చేలా చూడాలని కోరారు. గతంలో ఐదు సార్లు మొర పెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. గ్రామంలోని అక్రమణల పై విచారణ చేపట్టాలని వారు కోరారు.

శ్మశానవాటిక భూమిని కాపాడండి..

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆక్రమణకు గురవుతున్న జనగామ జిల్లా పెంబర్తిలోని 2.14 ఎకరాల శ్మశానవాటిక భూమిని కాపాడాలంటూ  ముస్లిం యువకులు కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్మశానవాటిక  భూమిని సర్వే చేయించి హద్దులు చూపించాలని తెలిపారు. వైకుంఠధామాల మాదిరిగానే ముస్లీంల శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహ్మద్‌ ఇబ్రహీం,  మసిహుర్‌ రెహమాన్‌, జాకీర్‌ పటేల్‌, యాకూబ్‌ పాషా, ఇస్మాయిల్‌, జహీర్‌, ఖలీల్‌, జాంగీర్‌, హైమద్‌ పాల్గొన్నారు.


శాఖల వారీగా దరఖాస్తులు ఇలా..
ఆర్డీవోల పరిధిలోనివి : 6
తహసీల్దార్ల పరిధిలోనివి : 29
ఏడీ సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ : 3
కలెక్టరేట్‌ ఏవో: 2, డీఆర్డీవో: 4
ఎస్సీ సంక్షేమశాఖ : 5
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ : 2
ఇతర శాఖలవి : 4


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని