logo

వరి పొలాలు బీడు.. యాసంగి ఆశలన్నీ మోడు..!

కోటి ఆశలతో ఆరంభించిన యాసంగి సీజన్‌లో సాగు నీటి కొరత అన్నదాతలను ఆందోళన కల్గిస్తోంది. సాగునీటి ఇబ్బందులు రావొద్దని  ముందస్తు సాగు చేస్తున్నా నీటి బాధలు తీరడం లేదు

Published : 31 Jan 2023 05:19 IST

దేవాదుల నీరందక నెర్రెలు బారుతున్న భూములు

జనగామ మండలం గానుగుపహాడ్‌లో నెర్రెలు బారిన వరి పొలాన్ని దిగులుగా చూస్తున్న రైతు రెడ్డబోయిన కనకయ్య

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: కోటి ఆశలతో ఆరంభించిన యాసంగి సీజన్‌లో సాగు నీటి కొరత అన్నదాతలను ఆందోళన కల్గిస్తోంది. సాగునీటి ఇబ్బందులు రావొద్దని  ముందస్తు సాగు చేస్తున్నా నీటి బాధలు తీరడం లేదు. అర కొర నీటి వనరులున్నప్పటికీ దేవాదుల నీరు అందుతుందని గంపెడు ఆశలతో పనులు ప్రారంభించారు. అందుకు బిన్నంగా పరిస్థితులు మారాయి. పచ్చని పొలాలు బీడులుగా మారడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వరినాట్ల దశలోనే పరిస్థితి తారుమారు అవడంతో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం

బోర్లు, బావుల నీటి వనరులతో రైతులు వరి నాట్లు వేశారు. స్థానిక నీటి వనరులతో పూర్తి స్థాయిలో పంట చేతికందే పరిస్థితులు లేవు. అన్నదాతల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. యాసంగి ముందస్తుగా ప్రారంభించారు. ఈ విషయం తెలిసినా అధికారులు, నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనారు.  గత నాలుగు నెలల క్రితం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ పరిధి జానకిపురం, పులుకుర్తి ప్రాంతంలోని చలివాగు పరిధిలో పైపులైన్లు దెబ్బతిన్నాయి. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు సత్వరంగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ నిర్లక్ష్య దోరణి రైతుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే వేల ఎకరాల వరి ఎండు ముఖం పట్టింది. ఇప్పటికీ పట్టించుకోకుంటే వేలాది ఎకరాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. పాలకులు మేల్కొని సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.
* నెర్రెలు బారిన వరి పొలాన్ని పుట్టెడు దుఃఖంతో ధీనంగా చూస్తున్న ఈ రైతు జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన రెడ్డబోయిన కనకయ్య. ఐదు ఎకరాల భూమిలో రెండు బోర్ల సహాయంతో నాలుగు ఎకరాల్లో వరి పంట వేశారు. నెల రోజుల క్రితం వరి నాట్లు పూర్తి అయ్యాయి.  విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ల దున్నకాలు, కూలీలకు సుమారుగా రూ.80వేలు పెట్టుబడి పెట్టాడు.  బోర్లలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో సమీపంలోని వాగు ఆధారితంగా సాగు చేస్తున్నాడు. వరి నాటు వేసిన కొద్ది రోజుల నుంచే బోర్లు అడుగంటి పోవడం, వాగుకు నీటి విడుదల నిలిచిపోవడంతో గత 20 రోజుల నుంచి నీటి ఇబ్బందులు తీవ్రమై వరి పైరు పూర్తిగా ఎండుతోంది.

జిల్లాలో సాగు ఇలా..

యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టే సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో సగటు సగటు వర్షపాతం కన్నా ఎక్కువగానే నమోదైనప్పటికీ అంతకు మించి నీటి వినియోగం పెరిగింది. జిల్లా నీటి వనరుల లభ్యతకు వెన్ను దన్నుగా నిలుస్తున్న దేవాదుల ప్రాజెక్టు ద్వారానే జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, మల్లన్నగండి, బొమ్మకూరు, కన్నెబోయిగూడెం, వెల్దండ, నవాబుపేట, చీటకోడూరు రిజర్వాయర్లకు, వందలాది చెరువులు, వాగులకు నీరు చేరాలి. సీజన్‌ మొదలైన నీరందక పోవడంతో జిల్లాలో ఇప్పటికే 5-10వేల ఎకరాల్లో పంట ఎండు ముఖం పట్టింది. మరో 10-15 రోజుల్లో 30వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని