logo

శివరాత్రి సన్నద్ధం.. షరా‘మామూలేనా’?

కాళేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు మరో 16 రోజులుండగా ఏర్పాట్లు ఆశించినంతగా జరగడం లేదు.. ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుక జరగనుండగా ఆ మేరకు వసతులు సమకూర్చాల్సిన అధికార యంత్రాంగం తాత్సారం వహిస్తోంది.

Published : 31 Jan 2023 05:19 IST

కాళేశ్వరం ఆలయం

న్యూస్‌టుడే, కాళేశ్వరం: కాళేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు మరో 16 రోజులుండగా ఏర్పాట్లు ఆశించినంతగా జరగడం లేదు.. ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుక జరగనుండగా ఆ మేరకు వసతులు సమకూర్చాల్సిన అధికార యంత్రాంగం తాత్సారం వహిస్తోంది. భక్తులు ఏటా పడే ఇబ్బందులు పునరావృతం కానున్నాయి. జిల్లా పాలనాధికారి సమక్షంలో వివిధ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు సమావేశం తేదీ ఖరారు కాలేదు. ఉత్సవాలకు ఒక్క రోజు ముందు అధికారులు హడావుడి చేస్తూ తాత్కాలికంగా పనులను పూర్తిచేయడం పరిపాటిగా మారింది. గోదావరి తీరం వద్ద పూర్వం నుంచి తాత్కాలిక నిర్మాణాలే శరణ్యమవుతున్నాయి. ఏళ్లు గడిచినా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం పనులు చేపట్టడం లేదు. దుస్తుల మార్పిడి గదులు, మెట్లపై షవర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉత్సవానికి ఒక్క రోజు ముందు అధికారులు హడావుడి చేస్తూ తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు దుస్తుల మార్పిడి గదులను ఏర్పాటు చేస్తారు. ఆలయం వద్ద అప్పటి వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వాహనాల్లో తరలిరానున్న నేపథ్యంలో వాహన నిలుపుదల సమస్య ఉత్పన్నమవుతోంది. గోదావరికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు వాహనాలను ఆపేయడంతో వృద్ధులు, చిన్నారులున్న కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇవి చేపట్టాలి..

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటాయించిన నిధులతో 100 గదుల అతిథి గృహం నేటి శివరాత్రికి ప్రారంభోత్సవం జరిగి భక్తలకు అందుబాటులోకి వస్తుందని భావించారు. నిర్మాణాల్లో జాప్యంతో భక్తులకు ఉపయోగపడని పరిస్థితి ఉంది. * ప్రధాన ఆలయ అనుబంధ శుభానందదేవి ఆలయం ముందు భాగంలో ధ్వజ స్తంభం లేకుండానే నేటి శివరాత్రి ముగిసేలా ఉంది. * కాళేశ్వర దేవస్థానానికి సంబంధించి గతంలో ఇతర పర్వదినాలతో పాటు శివరాత్రి సందర్భంగా ఒక లేఖ ద్వారా గ్రామ ప్రజలకు తెలిపేవారు.. దేవస్థానం సిబ్బంది ఒకరు గడప గడపకు వెళ్లి సంతకాలు తీసుకొని ఆహ్వానించేవారు. సాంకేతిక పరిజ్ఞానం మారడంతో దేవస్థానం అధికారులు మారినట్లు తెలిసింది. కేవలం సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. * గతంలో శివరాత్రి ఉత్సవాల ముగిసిన అనంతరం పూర్వపు ఆనవాయితీని అనుసరించి గ్రామంలోని ప్రజలకు స్వామి వారి ప్రసాదమైన రెండు లడ్డూలను పంపిణీ చేసేవారు. పంపిణీకి తిలోదకాలు ఇచ్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

లేఖ సమర్పించాం..

కాళేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్ల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు తేదీని ఖరారు చేసేలా పాలనాధికారిని లేఖ ద్వారా కోరినట్లు ఈవో మహేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని