logo

రహదారి.. ప్రమాదాల దరి!

గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏడు నెలలు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో వ్యయప్రయాసల మధ్య రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు

Published : 31 Jan 2023 05:19 IST

జాదరావుపేట, ఒడిపిలవంచ మధ్య కోతకు గురైన రోడ్డు

కాటారం, న్యూస్‌టుడే: గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏడు నెలలు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో వ్యయప్రయాసల మధ్య రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు గ్రామాలకు వెళ్లేందుకు ఒకే రోడ్డు మార్గం కావడంతో తప్పని పరిస్థితిలో గ్రామస్థులు ఈ దారుల నుంచే వెళ్లాల్సి వస్తోంది.. కాటారం మండలంలో 24 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దామెరకుంట, జాదరావుపేట రోడ్డు మార్గం గత వర్షాకాలంలో పూర్తిగా దెబ్బతింది. పలు గ్రామాల ప్రజలు ఇబ్బందికరంగానే ప్రయాణం కొనసాగిస్తున్నారు. రెండు గ్రామాల మధ్య దాదాపు 2 కి.మీ మేర రోడ్డంతా కొట్టుకుపోయింది. కంకర రాళ్లు బయటకు వచ్చాయి. వాహనాలు ఇటువైపుగా వెళ్లాలంటే ఆవస్థలు పడుతున్నారు. జాదరావుపేట, ఒడిపిలవంచ గ్రామాల మధ్యలో సగానికి పైగా రోడ్డు కోతకు గురై దర్శనమిస్తోంది. ఇటుగా వెళ్లే వాహనాలు పలుసార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. కోతకు గురైన చోట మట్టి పోయించి తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ వచ్చిన వానలతో మరోసారి రోడ్డు కోతకు గురికావడంతో ఇక చేసేదేమీ లేక ఆ రోడ్డు పైనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జాదరావుపేటకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పగా కాలు విరిగింది. ప్రతి 50 మీటర్లకు ఒక్క గుంత వాహనదారులకు స్వాగతం పలుకుతున్నాయి.


ప్రమాదాల బారిన పడుతున్నారు
- సుంకరి లక్ష్మయ్య, జాదరావుపేట

గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఇటువైపు వెళ్లే పలు వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. గ్రామం నుంచి కాటారానికి పాఠశాలలకు వెళ్లే బస్సులు ప్రమాదకరంగా పయనించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.


మరమ్మతులు చేపడుతాం..
- అవినాష్‌, ఏఈఈ, ఆర్‌అండ్‌బీ

తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాం. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. నెల రోజుల్లో పనులు ప్రారంభించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని