logo

నిధులున్నా.. పనులు అంతంతే..

పేరుకే డోర్నకల్‌ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, రైల్వే కూడలి, మున్సిపాలిటీ. ఇన్ని హోదాలు కలిగిన చోట నేటికీ స్త్రీనిధి కార్యాలయానికి సొంత భవనం లేదు.

Published : 31 Jan 2023 05:28 IST

డోర్నకల్‌లో అసంపూర్తిగా ఉన్న స్త్రీనిధి భవనం

డోర్నకల్‌, న్యూస్‌టుడే: పేరుకే డోర్నకల్‌ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, రైల్వే కూడలి, మున్సిపాలిటీ. ఇన్ని హోదాలు కలిగిన చోట నేటికీ స్త్రీనిధి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో మహిళల అగచాట్లు వర్ణానతీతం. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్త్రీనిధి భవనం నిర్మాణం కోసమని  ప్రభుత్వం రూ.25 లక్షలు కేటాయించింది. ఆరేళ్ల కిందట బొక్కలకొట్టు ప్రాంతంలో కట్టడం మొదలుపెట్టినా పనులు ఒక కొలిక్కి రాలేదు. పనులు పరిశీలించిన జిల్లా పాలనాధికారులు స్త్రీనిధి భవనాన్ని తక్షణం వాడకంలోకి తీసుకుని రావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కదలిక రాలేదు. సెర్ప్‌ ఏపీఎం మాలోతు శంకర్‌నాయక్‌ భవన అవసరాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రూ.5 లక్షలు మంజూరు చేశారు. డోర్నకల్‌లో 40 గ్రామైక్య సంఘాలకు తోడు 936 చిన్న సంఘాలుండగా 9956 మంది సభ్యులున్నారు. సొంత భవనం పూర్తి చేసి సత్వరం వినియోగం తీసుకుని రావాలని మహిళలు కోరుతున్నారు.


రక్షణ లేక బిక్కు బిక్కు
- చంద్రకళ, వెన్నారం

ప్రస్తుతమున్న అద్దె భవనంలో రక్షణ లేదు. వర్షమొస్తే పైకప్పు ఊరుస్తోంది. గ్రామైక్య సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుకు గాని వసతి లేదు. మండల పరిషత్తు కార్యాలయాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. ముఖ్యంగా అద్దె భవనం ఇటు ఆటోల అడ్డాలు, అటు బ్యాంకులకు అందుబాటులో లేదు. ఫలితంగా ప్రతి నిత్యం ప్రయాస తప్పడం లేదు.


మౌలిక వసతులు సమకూరుతాయి
- నాగమణి, మన్నెగూడెం

స్త్రీనిధికి సొంత భవనం ఉంటే మౌలిక వసతులు సమకూరుతాయి. ప్రభుత్వ పరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బంది ఉండదు. శిక్షణ పొందడానికి వేరొక చోటుకు వెళ్లాల్సిన అవసరం రాదు. అనుకూల వాతావరణం తోడుంటే విధి నిర్వహణ సజావుగా కొనసాగడమే కాదు  మరింత సమర్ధవంతంగా పని చేసే వీలు కలుగుతుంది.


నెలలోపు నిర్మాణం పూర్తి
- మాలోతు శంకర్‌నాయక్‌, ఏపీఎం, సెర్ప్‌

డోర్నకల్‌లో స్త్రీనిధి భవనం నిర్మాణంలో జరుగుతున్న జాప్యం గురించి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించి పనుల పూర్తికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా పనులు వేగవంతమయ్యాయి. అదనపు గది నిర్మాణానికి 2021-22 సీడీఎఫ్‌ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దీనికి గతేడాది సెప్టెంబర్‌ 24వ తేదీన భూమి పూజ చేశారు. నెలలోపు నిర్మాణం పూర్తి చేసి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ చేతుల మీదుగా భవనం ప్రారంభించి ప్రగతి మండల సమాఖ్యకు అందుబాటులోకి తీసుకొస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని