logo

రూ.లక్షల ఖర్చు.. మంచినీళ్ల ప్రాయం!

లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రజలకు దాహార్తి తీర్చాలన్న సంకల్పంతో నిర్మించిన ఇవి గత కొన్నేళ్లుగా వృథాగా ఉన్నాయి.

Published : 31 Jan 2023 05:28 IST

పైడిపల్లి ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన వృథాగా ఉన్న మంచినీటి ట్యాంకు

హసన్‌పర్తి (భీమారం), న్యూస్‌టుడే: లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకులు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రజలకు దాహార్తి తీర్చాలన్న సంకల్పంతో నిర్మించిన ఇవి గత కొన్నేళ్లుగా వృథాగా ఉన్నాయి. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

* హసన్‌పర్తి మండలం భీమారంలోని ఆనందనగర్‌ కాలనీలో 15 ఏళ్ల క్రితం పంచాయతీ రాజ్‌ శాఖ రూ.10 లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి ట్యాంకు ప్రారంభమైన కొద్ది రోజులకే పైపులైన్‌ మరమ్మతుకు గురైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆనందనగర్‌ కాలనీవాసులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. నూతన పైపులైన్‌ ఏర్పాటు చేసి వాడకంలోకి తీసుకురావాలని స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు.
* వరంగల్‌ మండలం పైడిపల్లిలోని ఎస్సీ కాలనీ, మద్దెగూడెం, కొత్తగూడెం కాలనీ, ప్రభుత్వ పాఠశాల ముందు, శివాలయం వీధి, ఆరెపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ట్యాంకులు 12 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రారంభించిన కొద్ది రోజులకే మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో దాహర్తి తీర్చిన ఈ ట్యాంకులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. తిరిగి వాడకంలోకి తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు వరంగల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉపయోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై వరంగల్‌ కార్పొరేషన్‌ డీఈ రవీందర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విషయాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని