logo

ఆశల ఓరుగల్లు.. కురిసేనా వరాల జల్లు!

వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

Published : 01 Feb 2023 02:36 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు.. నిధుల విడుదలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన హామీలతో పాటు తర్వాత కాలంలో కేంద్రం మంజూరు చేసిన పలు ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు దండిగా ఇవ్వాలని కోరుతున్నారు.


విలువ ఆధారిత పరిశ్రమలు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 8 లక్షల మంది రైతులు 19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు  చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు మిర్చి, పసుపు సాగవుతున్నాయి. కేంద్రం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏటా మద్దతు ధరను పెంచడంతో పాటు పంటలకు విలువ ఆధారిత పరిశ్రమలను (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు) ఏర్పాటు చేయాలి. ఈ మేరకు సాగు రంగానికి అధికంగా నిధులు  కేటాయించాలని అన్నదాతలు కోరుతున్నారు.

అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం కల్పించాలి.

ఉమ్మడి జిల్లాలో పండే పసుపు, పత్తి, మిర్చి, మామిడి, మొక్కజొన్నలో నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి పరిశోధన స్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.


‘స్మార్ట్‌’ వెలుగులు ప్రసరించేనా..

మొత్తం పనులు: 76

అంచనా విలువ(రూ. కోట్లలో): 978

పూర్తైన పనులు: 26

వీటి విలువ (రూ.కోట్లలో): 39.26

కొనసాగుతున్న పనులు: 50

హైదరాబాద్‌ తర్వాత పెద్దనగరమైన వరంగల్‌కు స్మార్ట్‌సీటీ పథకం 2016లో మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం రూ.193 కోట్లు విడుదల చేయగా.. రాష్ట్రం రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రం అందుకు యుటిలైజేషన్‌ ధ్రువపత్రం సమర్పిస్తేనే తన మిగిలిన వాటా ఇస్తానని కేంద్రం తెగేసి చెప్పింది.  

రాష్ట్రంతో సంబంధం లేకుండా మిగిలిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఈబడ్జెట్‌లో కేటాయింపు చేస్తే బాగుటుందని నగర ప్రజలు ఆశిస్తున్నారు.


పీఎం మిత్ర.. తోడ్పడాలి..

మ్మడి జిల్లాలో ఏటా 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా 3.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. సుమారు 6500 మంది చేనేత కార్మికులున్నారు.
జిల్లాలోని వస్త్ర పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. పీఎం మిత్ర పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడు జౌలీ పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మోగా వస్త్ర పరిశ్రమకు పీఎం మిత్ర పథకంలో ఎంపిక చేసి నిధులు కేటాయించాలని లేఖ రాసింది.  ఇందులో భాగంగా ఈ పరిశ్రమ ఎంపిక అయితే కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో స్పిన్నింగ్‌ మిల్లులను ఏర్పాటు చేయాలి. కలర్‌డై యారన్ల మిల్లులను కూడా ఏర్పాటు చేసేలా బడ్జెట్‌ కేటాయిస్తే ఇబ్బందులు తప్పుతాయని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు.

జీఎస్టీని ఎత్తివేసి.. హ్యాండ్లూమ్స్‌ ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా దుకాణాలను ఏర్పాటు చేయాలని కార్మికుడు సాంబయ్య కోరుతున్నారు.


నిధులిస్తేనే గిరి విశ్వవిద్యాలయానికి మహర్దశ

ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. రెండేళ్ల కిందట ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో 837 సర్వే నెంబరులోని 360 ఎకరాల ప్రతిపాదిత స్థల సేకరణ పూర్తి చేసి గిరిజన సంక్షేమశాఖకు ఏడాది కిందట అప్పగించారు. పనులు చేపట్టడం లేదు. బడ్జెట్‌లో  రూ.500 కోట్ల నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టి తరగతులు జరిగేలా చూడాలి. దీని వల్ల రాష్ట్రంలో ఉన్న వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతుంది.

ప్రతి జిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, హనుమకొండలో సైనిక్‌ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇందుకు కేంద్రం ఈ బడ్జెట్‌లో వందశాతం నిధులను కేటాయించాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.  


విమానం ఎగిరేనా..

రంగల్‌ మామునూరులో నిజాం కాలంలో నిర్మించిన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఓరుగల్లువాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాణిజ్య, వ్యాపారం, ఐటీ పరంగా వృద్ధి చెందుతున్న వరంగల్‌కు ఇది ఎంతో అవసరం. ప్రస్తుతం 707 ఎకరాల భూమి ఉంది. మరో 400 ఎకరాల భూమిని సేకరించారు. రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకు రూ.130 కోట్లు అవసరం. రన్‌వే మరమ్మతులు, విద్యుత్తు, నీరు, రోడ్లు ఇతర సౌకర్యాలు కల్పించి విమాన ప్రయాణాలను ప్రారంభించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని..

ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కాకతీయ కాలం నాటి దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపును చేయాలి.

రైతుల మేలు చేసే జాతీయ వ్యవసాయ విపణి(నామ్‌) ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్‌, జనగామ, నర్సంపేట, పరకాల, వరంగల్‌ ఎనమాముల మార్కెట్లలో పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చూడాలి.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి.

కొత్త జిల్లాల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి.


ఆదాయ పరిమితి పెంచితే మేలు

త్రిపురనేని గోపీచంద్‌, సీఏ, వరంగల్‌

ప్రస్తుతం స్వల్ప ఆదాయ వర్గాల వారు రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లించనవసరం లేదు. ఈ ఆదాయం రూ.ఐదు లక్షల ఒక రూపాయి కాగానే వారికి రూ.12,500 పన్ను వస్తుంది. అలా కాకుండా రూ.6 లక్షల ఆదాయ పరిమితి పన్ను లేకుండా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.10 లక్షల ఆదాయ పరిమితికి పన్ను లేకుండా ఉండాలి. ఉద్యోగులకూ అదనపు బెనిపిట్‌ సౌకర్యం కల్పించాలి. వేర్వేరు మార్గాల నుంచి ఆదాయ పన్ను శాఖకు అందుతున్న సమాచారాన్ని దాన్ని రిటన్‌ ఫైల్‌ చేసే సమయంలో అప్‌లోడ్‌ కాకుండా వాటికి సమాధానం చేసేలా నిబంధన పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదో ఒక సాకు చెప్పి ఫైన్‌ వేయడం వల్ల అందరి సమయం వృథా అవుతుంది.


ఉపాధికి హామీ ఇవ్వాలి

డాక్టర్‌. తిరుణహరి శేషు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్థశాస్త్రం, కాకతీయ విశ్వవిద్యాలయం

బడ్జెట్‌ అంటే అంకెలు కాదు.. అది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా, ప్రజా సమస్యలను పరిష్కరించేందిగా ఉండాలి. గత బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకానికి 25 శాతం నిధుల కోత పెట్టారు. ఈసారి నిధులు ఎక్కువగా ఇవ్వాలి.  వేతన జీవులకు మేలు చేసే విధంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచితే బాగుటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని