logo

మేడారం జాతరొచ్చే.. వనమంతా జనమాయే..

భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం పరవశించింది.

Published : 02 Feb 2023 05:38 IST

సమ్మక్క అడేరాలను గద్దెల వద్దకు తీసుకొచ్చిన పూజారులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి,  మంగపేట, న్యూస్‌టుడే: భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం పరవశించింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు.. శివసత్తుల పూనకాలు.. తీరొక్క మొక్కులు.. చంటి పాపలు మొదలుకొని ముదిమి వయసు వారితో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మేడారంలో బుధవారం మండమెలిగే పండగ(చిన్న జాతర) ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రాకతో వనం జనమయమైంది.

ఆలయ శుద్ధి.. ద్వారబంధనాలతో ఆరంభం

గిరిజన ఆదివాసీ సంప్రదాయాలతో వేడుక ఆరంభమైంది. మేడారంలో సిద్ధబోయిన, కొక్కెర, చందా వంశీయులు, కన్నెపల్లిలో కాక వంశీయులు ఉదయాన్నే అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని గుట్ట నుంచి గడ్డి, అడవుల నుంచి పుట్ట మట్టిని తీసుకొచ్చారు. పూజారులు సంప్రదాయ తెల్లని వస్త్రాలు ధరించి సిద్ధబోయిన ముణీందర్‌ ఇంటి వద్ద సమావేశమయ్యారు. పండగ నిర్వహణపై చర్చించుకున్నారు. అక్కడి నుంచి పూజారులు, వారి ఆడపడుచులు డోలి వాయిధ్యాలతో ఆలయాలకు చేరుకున్నారు. ఆడపడుచులు గుడిలో అలికి ముగ్గులు వేశారు. అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బొడ్రాయి, పోచమ్మ, తదితర గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దుష్ట శక్తులు దరి చేరకుండా తూర్పు పడమరన దిష్టితోరణాలను కట్టారు. ఈ క్రతువును చూసేందుకు భక్తులు తరలివచ్చారు. అనంతరం ఊరట్టంలోని మాజీ ఎమ్మెల్యే చర్ప భోజరావు కుటుంబీకులు సమర్పించిన చల్లపెయ్యను ఊరేగింపుగా డోలివాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకొచ్చారు.

గద్దెల వద్ద రహస్య పూజలు.. జాగరణ..

చల్లపెయ్యను ఆలయానికి తీసుకొచ్చిన అనంతరం ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుని రాత్రి నిర్వహించే పూజా కార్యక్రమాల సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. రాత్రి మేడారం నుంచి సమ్మక్క, కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజాసామగ్రితో తరలివచ్చారు. పూజారులు గద్దెలకు చేరే క్రమంలో భక్తులు పెద్దఎత్తున జై సమ్మక్క తల్లీ, జై సారలమ్మ తల్లీ అంటూ వారికి స్వాగతం పలికారు. గద్దెలకు చేరుకోగానే.. విద్యుత్తు దీపాలను ఆర్పి రహస్య పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఘనమైన చరిత్రను వంశస్థులకు ఉపదేశించారు. రాత్రంతా జాగరణ చేశారు.

కుటుంబ సమేతంగా మొక్కులు

చిన్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టంక్రాస్‌ తదితర ప్రాంతాల్లో భక్తులు విడిది చేశారు.

భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం

ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడారం చిన్న జాతర నిర్వహణ కోసం రూ. 3.10 కోట్లను ఖర్చు చేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌష్‌ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఓఎస్డీ అశోక్‌ కుమార్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ గోవింద్‌నాయక్‌ తదితరులతో కలిసి ఆమె బుధవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటి వరకు మేడారం అభివృద్ధికి, జాతరల నిర్వహణకు రూ. 400 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఏర్పాట్లు బాగున్నాయని ఎస్పీ, పీఓను ఆమె అభినందించారు. మేడారం సర్పంచి చిడం బాబురావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈవో రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సమ్మక్కకు మొక్కులు సమర్పిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని