logo

ఇంటింటికీ మిషన్‌ భగీరథ జలాలు

వేసవిలో తాగునీటికి ఎద్దడి ఏర్పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికి అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 05:38 IST

కార్యదర్శులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌

డోర్నకల్‌, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటికి ఎద్దడి ఏర్పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికి అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. డోర్నకల్‌లో బుధవారం నిర్వహించిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఆయన నీటి సరఫరాను మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులను వరుసగా ఒక్కొక్కరిని వేదిక ముందుకు పిలిచి గ్రామాలవారీగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా తీరు తెన్నులపై సమగ్ర సమీక్ష జరిపారు. లోపాలున్న చోట వాటిని అధిగమించడానికి సత్వర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పలువురు సభ్యులు ప్రస్తావించారు. నియామకం జరిగిన చోట పని చేయని ఆశా కార్యకర్తల గురించి సర్పంచులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలల్లో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండటం లేదని  తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరికి వారు తమకు ఇష్టమొచ్చినట్లుగా పని చేస్తామంటే మానుకోమనండని ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు.  సమావేశానికి రాని విద్యాశాఖాధికారి గురించి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లండని ఎంపీడీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎంపీపీ బాలునాయక్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌ తమకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వడం లేదన్నారు. పంచాయతీరాజ్‌ పనులను డీఈఈ మహేష్‌, వ్యవసాయ శాఖ పనులను ఏవో రామారావు సమీక్షించారు. ఎంపీపీ బాలునాయక్‌, జడ్పీటీసీ సభ్యురాలు పొడిశెట్టి కమల, ఎంపీడీవో అపర్ణ, తహసీల్దార్‌ స్వాతి బిందు, సొసైటీ అధ్యక్షులు సీతారామిరెడ్డి, బిక్షంరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని