logo

భారాస సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

సరైన సమయంలో అందించే విద్యతోనే విద్యార్థుల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 02 Feb 2023 05:38 IST

మహిళలతో కోలాటం ఆడుతున్న మంత్రి దయాకర్‌రావు

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: సరైన సమయంలో అందించే విద్యతోనే విద్యార్థుల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలం లక్ష్మణ్‌తండా పంచాయతీ పరిధిలోని మొండిచింత తండాలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునికీకరించిన పాఠశాలను బుధవారం ఆయన కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మంత్రికి మహిళలు, విద్యార్థులు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఎర్రబెల్లి తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానోపాధ్యాయుడి గది, వంటగది, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.  ధర్మాపురం పంచాయతీ పరిధిలోని ఐదు తండాల్లో రూ.2కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు.  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7222 కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రజల సంక్షేమం కోసం జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్న కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రూ.3.25 కోట్ల విలువైన చెక్కు అందించారు. పంచాయతీ  భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ సభ్యురాలు పల్లా భార్గవి, సర్పంచి వీరేష్‌, ఎంపీటీసీ సభ్యుడు ఉపేందర్‌, డీఈవో రాము, పీఆర్‌ఈఈ చంద్రశేఖర్‌, డీఏవో వినోద్‌కుమార్‌, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

పాలకుర్తి: పాలకుర్తిలోని సోమేశ్వరాలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, చండీకా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన గోడపత్రికలను దేవరుప్పులలో మంత్రి దయాకర్‌రావు, కలెక్టర్‌ శివలింగయ్య, జడ్పీ ఛైర్మన్‌ సంపత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ఛైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, ఈవో రజినికుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని