logo

ప్రాణం తీసిన తామర పురుగు

మిరప పంట చేతికొస్తే చేసిన అప్పులు తీర్చాలని భావించారు ఆ యువరైతు.. పంట మంచి కాత వస్తోందని మురిసిపోయారు.

Published : 02 Feb 2023 05:38 IST

అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మిరప పంట చేతికొస్తే చేసిన అప్పులు తీర్చాలని భావించారు ఆ యువరైతు.. పంట మంచి కాత వస్తోందని మురిసిపోయారు. ఇంతలోనే తామర పురుగుతో ఆశించడంతో కలవరం చెందారు. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో దిగుబడి రాదేమోనని మనస్తాపం చెంది బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్‌ మండలం రోటిబండ తండాకు చెందిన అజ్మీరా రవీందర్‌(30) గత ఏడాది రెండు ఎకరాల మిరప సాగు చేశారు. సుమారు రూ.3లక్షలు పెట్టుబడి పెట్టారు. నల్లి తామర సోకి పంట పూర్తిగా నష్టపోయారు. ఈ ఏడాదైనా కలిసి వస్తుందని ఆశించి మళ్లీ మిర్చి వేశారు. పంట చేతికొచ్చే సమయానికి నల్లి తామర సోకి పంట ఎండిపోయింది. గత సంవత్సరం రూ. 2 లక్షలు, ఈ ఏడాది రూ. 2 లక్షలు పెట్టుబడికి రుణం తీసుకున్నారు. దీంతోపాటు రూ.8 లక్షలు వెచ్చించి డోజర్‌ వాహనం కొనుగోలు చేశారు. రుణం తీర్చలేనేమోనని మనస్తాపానికి గురయ్యారు. బుధవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గడ్డి మందు తాగి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య భద్రకు ఫోన్‌ చేసి చెప్పారు. కుటుంబ సభ్యులు రవీందర్‌ను మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. రవీందర్‌కు భార్య భద్ర, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయమై మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తమకు రైతు కుటుంబం నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని