logo

ఓరుగల్లు ప్రగతికి సప్త స్వరాలు

‘వందేళ్ల దిశగా పయనిస్తున్న భారతావనికి ఈ బడ్జెట్టు ఊతమిచ్చేదిగా ఉంది. మహిళలు, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించే లక్ష్యంతో రూపొందించిన పద్దు ఇది.’

Updated : 02 Feb 2023 09:50 IST

అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా పద్దు

‘వందేళ్ల దిశగా పయనిస్తున్న భారతావనికి ఈ బడ్జెట్టు ఊతమిచ్చేదిగా ఉంది. మహిళలు, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించే లక్ష్యంతో రూపొందించిన పద్దు ఇది.’

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర విత్తన పద్దును బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి ఏడు శాతం ఉంటుందనే అంచనాతోపాటు, పద్దులో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని ‘సప్తర్షి’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇది ఓరుగల్లు సప్త స్వరాల పద్దుగా అభివర్ణించొచ్చు. మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా  కీలక రంగాలకు కేటాయింపులు చేయడం వల్ల మన ప్రాంతానికి మేలు జరిగే అవకాశం ఉంది.

ఈనాడు, వరంగల్‌


1. సామాన్యులకు ఊరట

వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా ఆదాయపు పన్నుపై మినహాయింపు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌లో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు కలిపి లక్ష వరకు ఉన్నారు. తాజా పన్ను మినహాయింపు వల్ల వీరిలో చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది.

ఉదాహరణకు..: రూ.7 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. హనుమకొండకు చెందిన ప్రవీణ్‌ ప్రయివేటు కంపెనీలో  నెలకు రూ.55 వేలు వేతనం పొందుతున్నారు. అంటే ఏడాదికి రూ.6.6 లక్షల ఆదాయం ఉంది కాబట్టి ప్రవీణ్‌పై ఎలాంటి పన్ను పోటు లేదు. జనగామకు చెందిన కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఏడాదికి రూ.7.5 లక్షల వేతనం పొందుతున్నారు. రూ.7 లక్షల వేతనం దాటినందున రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల శ్లాబుకు 5 శాతం అంటే రూ.15 వేలు, రూ.6 లక్షల నుంచి రూ.7.5 లక్షలు అంటే మిగతా రూ.1.50 లక్షల మీద 10 శాతం అంటే మరో రూ.15 వేలు.. మొత్తం రూ.30 వేల వరకు కుమార్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 80సి, 24 కింద ప్రయోజనాలు ఉండవు. ఒకవేళ పాత విధానంలో ఉంటే పొదుపు మొత్తాలపై పన్నులో ప్రయోజనాలు పొందొచ్చు.


2. మహిళా సాధికారత

రైతు ఉత్పత్తి కేంద్రాల్లో అద్దెకు ఉన్న వ్యవసాయ పనిముట్లు

దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన పథకంలో జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ కింద దేశవ్యాప్తంగా 81 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిని మరింత బలోపేతం చేయన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి వరంగల్‌లోని 62,658 వరకు స్వయం సహాయక సంఘాలకు మేలు కలగనుంది. లక్షలాది మంది సభ్యుల్లో చాలా మంది పొదుపు రుణాలు తీసుకొని చిన్నపాటి వ్యాపారవేత్తలుగా ఎదిగారు.

* వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో చెన్నారావుపేట, నెక్కొండ మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలే సభ్యులుగా ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తి కేంద్రం (ఎఫ్‌పీఓ) లాభాల బాటలో సాగుతోంది. రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇస్తూ       రూ.లక్షల్లో లావాదేవీలు చేస్తున్నారు.


3. విద్యా వెలుగులు

ఏకలవ్య పాఠశాల

* గిరిజన విశ్వవిద్యాలయం కోసం ములుగు గట్టమ్మ వద్ద 345 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ఏపీ, తెలంగాణలోని గిరిజన వర్సిటీలకు కలిపి రూ.37 కోట్లను కేటాయించారు. ఇందులో సగం అంటే రూ.18 కోట్లకు పైనే  వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటైతే గిరిజన ప్రాబల్యం ఉన్న ములుగుతోపాటు, మహబూబాబాద్‌ జిల్లాలోని ఎస్టీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

* గిరిజన ప్రాంతాల్లో మరో 740 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటుచేయనున్నారు. వీటిల్లో 38,800 ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. మొత్తంగా 3.5 లక్షల గిరి పుత్రులకు విద్యా వెలుగులు అందుతాయి. ఇప్పటికే మహబూబాబాద్‌ జిల్లాలో ఏకలవ్య పాఠశాలల ద్వారా గిరిజన బిడ్డలకు కార్పొరేట్‌ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోంది. ఉమ్మడి జిల్లాలో కురవి, సీరోలు, బయ్యారం, కొత్తగూడ, గూడూరు ప్రాంతాల్లో ఉన్నాయి.

* పిల్లలు, యువత కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. గ్రామ, వార్డు స్థాయిలో వీటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యకు పెద్దపీట వేయనున్నారు. ఉమ్మడి వరంగల్‌లో 1500కు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేసే వీలుంది.

* విద్యాభివృద్ధికి చేసిన కేటాయింపుల వల్ల ఉమ్మడి జిల్లాకు పలు ప్రయోజనాలు కలిగే వీలుంది.


4. నగరాలకు మహర్దశ

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన ఓరుగల్లు తృతీయ శ్రేణి నగరంగా ఉంది. ఇప్పటికే కేంద్రం స్మార్ట్‌ సిటీ, అమృత్‌, హృదయ్‌ పథకాలను మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొత్త పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో వరంగల్‌తోపాటు జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌లకు లబ్ధి చేకూరే వీలుంది. ఈ పథకం ద్వారా పారిశుద్ధ నిర్వహణ మెరుగుపడనుంది.  కార్మికులు దిగేందుకు వినియోగించే మ్యాన్‌హోళ్ల స్థానంలో యంత్రాలతో శుభ్రం చేసే మెషిన్‌హోళ్ల విధానం రానుంది. తడి, పొడి చెత్త నిర్వహణకు శాస్త్రీయ విధానాలను అవలంబిస్తారు.

* నగరాలను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లతో పట్టణ మౌలిక అభివృద్ధి నిధి (అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) ఏర్పాటు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ఈ నిధి వినియోగిస్తాం.’’


5. విమానానికి  దగ్గరగా

విమానయానాన్ని పౌరులకు మరింత చేరువ చేసేందుకు  రీజనల్‌ కనెక్టివిటీ పేరుతో కొత్తగా 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. ఈ కొత్త విధానంలో వరంగల్‌ మామునూరు పాత విమానాశ్రయ పునరుద్ధరణకు నిధులొస్తే ఉమ్మడి వరంగల్‌ వాసులందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.


6. యువత బలోపేతం

జాతీయ నూతన విద్యా విధానం ద్వారా యువతను బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు పద్దులో పొందుపరిచారు. కేంద్ర సాంకేతిక విద్యా సంస్థల్లో వంద చోట్ల 5జీ ప్రయోగశాలలను ఏర్పాటుచేయనున్నారు. కృత్రిమ మేధ ద్వారా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు  నిధులు కేటాయించారు. వరంగల్‌ ఎన్‌ఐటీకి  5జీ ప్రయోగశాలతోపాటు, కొత్త ఆవిష్కరణలకు అదనంగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

* ‘ప్రధాన్‌ మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 ద్వారా వచ్చే మూడేళ్లలో లక్షలాది యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తాం’్చ


7. సేంద్రియం వైపు అడుగులు

కేంద్రం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తే జిల్లాలో వేలాది రైతులకు లబ్ధి కలుగుతుంది.వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంతోపాటు, పర్వతగిరి మండలంలో చిరుధాన్యాల యూనిట్లు వస్తున్నాయి. వరంగల్‌లో వ్యవసాయ కళాశాల కూడా ఉంది. వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహిస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యువర్‌లుగా ఎదిగే అవకాశం ఉంది.

* ‘‘దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సేంద్రియ సాగువైపు మళ్లిస్తాం..  చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తాం. వ్యవసాయానికి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి తద్వారా వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను ఏర్పాటుచేస్తాం.’’


ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా
- ఆచార్య ఎన్‌.వి.రమణారావు, సంచాలకుడు, నిట్

కేంద్ర పద్దులో విద్యా రంగానికి ఊతమిచ్చేలా, ఆవిష్కరణలు ప్రోత్సహించేలా కేటాయింపులు బాగున్నాయి. 5జీ ల్యాబ్‌లు వంద స్థాపిస్తామన్నారు. ఇందులో వరంగల్‌ నిట్లో కూడా వచ్చే అవకాశం ఉంది.  


అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని..
- పి.వి.నారాయణరావు, ఛార్టెట్‌ అకౌంటెంట్‌, వరంగల్‌

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలను సంతృప్తి చేసేలా పద్దును తీర్చిదిద్దారు. ఆదాయపు పన్ను రిబేట్ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు హర్షణీయం. జౌళి రంగానికి కేటాయింపులు లేవు. ఏకలవ్య పాఠశాలల్లో టీచర్ల నియామకం వల్ల అవిభాజ్య వరంగల్‌ జిల్లాలో విద్యావంతులకు అవకాశం రానుంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు