logo

సాంకేతిక సమస్య.. స్తంభించిన పాలన

నగరపాలక సంస్థలో పాలన స్తంభించింది. నెలరోజులుగా జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైటులో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి.

Updated : 03 Feb 2023 06:36 IST

ట్రేడ్‌ లైసెన్సు పేజీ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థలో పాలన స్తంభించింది. నెలరోజులుగా జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైటులో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. జనవరి 2న గ్రేటర్‌ వరంగల్‌ ఇ-ఆఫీసు ఎత్తివేసి రాష్ట్ర పురపాలక శాఖకు చెందిన సెంటర్‌ ఫడ్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)లోకి అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఆస్తిపేరు మార్పిడి, ఆస్తుల విభజన,  ఆస్తిపన్ను మదింపు, సవరణలు, కుళాయి కనెక్షన్‌, కొత్త ట్రేడ్‌లైసెన్సు దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఓనర్‌షిప్‌, అసెస్‌మెంటు కాపీ, నో డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో చరాస్తుల రిజిస్ట్రేషన్లు ఆగాయి. కాజీపేట, కాశీబుగ్గ, బల్దియా ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల ఇ-ఆఫీస్‌ దస్త్రాల కదలిక తెలియడం లేదు. ఆస్తిపన్ను చెల్లింపులు, బకాయిల వివరాలు తప్పులు చూపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గ్రేటర్‌లో పాలన ఆగిపోయింది. నగర ప్రజలు కార్యాలయాల చుట్ట్టూ తిరుగుతున్నారు. రేపు, మాపు అని దాటవేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడింది. ఆస్తి, నల్లా, ప్రకటనల పన్నుల వసూళ్లకు ఇదే మంచి సమయం. నెల రోజులుగా జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైటు సాంకేతిక సమస్యతో పన్నుల వసూళ్లు మందగించాయి. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.


ప్రజల ఇబ్బందులివే

* వరంగల్‌ ప్రాంతానికి ఓ వ్యక్తి రూ.15 వేల ఆస్తి పన్ను చెల్లిస్తే రూ.5 వేలకే రశీదు వచ్చింది. దీంతో రూ.10వేలు తిరిగి ఇచ్చేశారు. హనుమకొండకు చెందిన ఓ మాల్‌ రూ.4.25 లక్షల ఆస్తిపన్ను బకాయి ఉంటే జీరో బ్యాలెన్సు అని వస్తోంది * ట్రేడ్‌ లైసెన్సు పన్నుల వసూళ్లు పూర్తిగా ఆగాయి. అంతర్జాలంలో వివరాలు చూపించడం లేదు. కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు * కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాలు, 42 విలీన గ్రామాల్లో చరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఓనర్‌షిప్‌, అసెస్‌మెంటు, నో డ్యూ సర్టిఫికెట్లు రావడం లేదు * ఆస్తిపేరు మార్పిడి, కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. పాత దస్త్రాల వివరాలు చూపించడం లేదు* పన్నులు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ విభాగాల్లో  పౌరసేవలకు ఇబ్బందిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని