logo

రైతులకు రెట్టింపు.. సీసీ ఛార్జీల వడ్డింపు

రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది.

Published : 03 Feb 2023 06:28 IST

ఏడాదికి రూ.320కి బదులుగా ఒక్కోచోట ఒక్కో రకంగా..

రూ.750 వసూలు..రశీదు

జనగామ, నర్సంపేట, న్యూస్‌టుడే: రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది. సరఫరా నిర్వహణలో భాగంగా వినియోగదారు రుసుము (కస్టమర్‌ ఛార్జీ) పేరిట రైతులు నెలకు రూ.30 చొప్పున ఏకమొత్తంగా ఏడాదికి రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పెంపు ఆదేశాలు లేకున్నా నాలుగేళ్లుగా దీనికి రెట్టింపు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.


ఉత్తర్వులు లేవు.. వసూళ్లు ఉన్నాయ్‌

ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతుల నుంచి ఏటా డిసెంబరు మొదటి వారం నుంచి చివరి వారంలోపు సీసీ రుసుము తీసుకుంటారు. వ్యవసాయ సర్వీసుల సంఖ్యకు అనుగుణంగా సీసీ రుసుము లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీంతో 2018 నుంచి క్రమం తప్పకుండా చెల్లించే రైతుల నుంచే రెట్టింపు వసూలు చేస్తున్నామని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇది కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు..  నిర్ధేశిత మొత్తానికి మించి వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్తు శాఖ ఎస్‌ఈలు, డీఈలు అంటున్నారు. పెంపుదలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవని అంగీకరిస్తున్నారు.


ఉదాహరణలు ఇవిగో..

జనగామ జిల్లాలో అన్ని చోట్ల రైతుల నుంచి ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. రఘునాథపల్లి మండలంలో ఓ గ్రామంలో గతేడాది రూ.360 చొప్పున వసూలు చేశారు. లింగాలఘన్‌పూర్‌ మండలం వనపర్తిలో ఓదఫా రూ.750 తీసుకున్నారు. తమ గ్రామాల్లో ఏటా రూ.750 వసూలు చేస్తున్నారని జఫర్‌గఢ్‌కు చెందిన వేములయ్య అనే రైతు, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన ముక్కెర మధు తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలానికి చెందిన మాచర్ల ఏసురత్నం అనే రైతు తమ ప్రాంతంలో రూ.500 చెల్లిస్తున్నట్లు చెప్పారు.

ఒక రైతు పరంగా చూస్తే ఇది రూ.వందల్లోనే కనిపిస్తుంది. ఒక ఊరు, ఒక జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే రూ.కోట్ల మేర అదనపు భారం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఏటా సీసీ ఛార్జీల రూపేణా       రూ.16.20 కోట్లు వసూలు కావాలి.  రూ.720 చొప్పున వసూలు చేస్తే రైతులపై అదనంగా మరో రూ.16 కోట్ల భారం పడుతుంది.


మూడేళ్లుగా చెల్లిస్తున్నా

- గుండె గోపాల్‌రావు, లెంకాలపల్లి, నల్లబెల్లి మండలం

మా కుటుంబంలో మూడు వ్యవసాయ కనెక్షన్లుండగా నిరుడు ఒక్కో దానికి రూ.600 చొప్పున రూ.1800 చెల్లించాను. ఈ ఏడాది అంతే మొత్తం చెల్లించాను విద్యుత్తు అధికారులు మూడేళ్లుగా ఇలాగే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక్కో మోటారుకు ఏడాదికి రూ.360లే కదా అని అడిగితే పెరిగాయని చెప్పారు. నిజమే కావొచ్చని వారడిగినంత చెల్లించి రశీదు తీసుకుంటున్నా.


సరఫరా నిలిపివేస్తున్నారు..

- ఐరెడ్డి జితేందర్‌రెడ్డి, బానోజిపేట, నర్సంపేట మండలం

ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న మాట  సరికాదు. మాకు రెండు వ్యవసాయ మోటార్లున్నాయి. సర్వీసు ఛార్జీ కింద సంవత్సరానికి రూ.360 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అధికారులు మాత్రం రూ.600 వసూలు చేస్తున్నారు. బిల్లుల వసూళ్ల కోసం పంటల సీజన్‌లో కరెంటు సరఫరాను నిలిపి వేస్తున్నారు.

* ఎన్‌పీడీసీఎల్‌ సీజీఎం(ఫైనాన్స్‌) తిరుపతిరెడ్డిని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు, నిబంధనలు లేవన్నారు. ఎస్‌ఈ వేణుమాధవ్‌తో గ్రూప్‌కాల్‌ ద్వారా మాట్లాడారు. రైతులు అదనంగా చెల్లిస్తే వారికే చెందుతుందని ఆయన వివరించారు.

* ‘ఉన్నతాధికారుల వద్ద ఎక్కువ బిల్లు వసూళ్ల విషయాన్ని ప్రస్తావిస్తే.. బలవంతం చేయడం లేదని అడిగితే వారే స్వచ్చందంగా చెల్లిస్తున్నారని జిల్లా ఎస్‌ఈ మధుసూదన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని