logo

అప్పు చెల్లించమన్నందుకు గొడ్డలితో నరికిన బంధువు

అప్పు చెల్లించమని అడిగినందుకు సమీప బంధువని చూడకుండా ఓ రైల్వే ఉద్యోగి సహచర ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 06:28 IST

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

ప్రదీప్‌

అయోధ్యపురం(కాజీపేట రూరల్‌), న్యూస్‌టుడే: అప్పు చెల్లించమని అడిగినందుకు సమీప బంధువని చూడకుండా ఓ రైల్వే ఉద్యోగి సహచర ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ పి.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన జిర్ర ప్రదీప్‌(27), పెసరు వినయ్‌కుమార్‌ అలియాస్‌ ఆగం రైల్వేలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరు సమీప బంధువులు. వినయ్‌కుమార్‌కు ఐదేళ్ల క్రితం ప్రదీప్‌ రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వాలని అడగ్గా వినయ్‌కుమార్‌ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ప్రదీప్‌ అడ్డు తొలగించుకోవాలని వినయ్‌కుమార్‌ భావించాడు. తన మిత్రుడు కాశబోయిన గోపితో కలిసి పథకం ప్రకారం గురువారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న ప్రదీప్‌ను గ్రామ శివారుకు రప్పించాడు. మద్యం తాగిన తర్వాత వెంట తెచ్చుకున్న గొడ్డలితో అతడి తలపై వెనుక నుంచి నరికి పారిపోయారు. నిర్జన ప్రదేశం కావడంతో ప్రదీప్‌ అరిచినా ఎవరికీ వినిపించలేదు. అటువైపు బహిర్భూమికి వెళ్లిన స్థానికుడు యుగేంధర్‌ అతణ్ని చూసి తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్‌ను ఏం జరిగిందని అడగ్గా.. జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న అతణ్ని హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో అతడు మృతి చెందాడు. భార్య శ్రావణి, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలాన్ని కాజీపేట ఏసీపీతో పాటు కాజీపేట, ధర్మసాగర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు మహేందర్‌రెడ్డి, రమేశ్‌, ఎస్సైలు నర్సింహారావు, దివ్య సందర్శించి ఆధారాలను సేకరించారు. మృతుడి తల్లి ఉపేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని