logo

భాషా పండితుల పదోన్నతులకు నిరీక్షణే..

ఎనిమిదేళ్ల తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది.

Published : 03 Feb 2023 06:32 IST

సమస్యలు పరిష్కరించాలని ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరుతున్న  ఎస్జీటీ, భాషా పండితులు.

భూపాలపల్లి, న్యూస్‌టుడే : ఎనిమిదేళ్ల తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఇది చాలా మంది ఉపాధ్యాయులకు ఆనందాన్ని కలిగిస్తుండగా.. భాషా పండితులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కోర్టు కేసు ఉందన్న సాకుతో ప్రస్తుత పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశం కల్పించకపోవడంతో వారు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎస్‌జీటీలతో సమాన హోదా గల రెండో గ్రేడ్‌ భాషా పండితులు మాత్రం ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) విధులు నిర్వహిస్తున్నారు. వారు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే బోధన చేయాల్సి ఉండగా చాలా పాఠశాలల్లో పదో తరగతి వరకు రెండో గ్రేడ్‌ పండితులే అదనంగా పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ బోధించే పండితులు ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోకపోవడంతో ఎంతో నష్టపోతున్నారు. వారు 20 ఏళ్లుగా రెండో గ్రేడ్‌ భాషా పండితులుగానే కొనసాగుతుండడం గమనార్హం.  వ్యాయామ ఉపాధ్యాయుల(పీఈటీ) పరిస్థితీ అలాగే ఉంది. ఎస్‌జీటీ స్థాయిలో పనిచేస్తున్న వారు కూడా స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి పీడీగా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. వీరి గోడు పట్టించుకునే వారే కరవయ్యారు.


ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..

- ఎండి. దిల్షాద్‌, తెలుగు పండితుడు, నాగారం, యూపీఎస్‌

భాషా పండితులకు పదోన్నతులు కల్పించకుంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తాం.. 9,10వ తరగతులకు తెలుగు, హిందీ సబ్జెక్టులు బోధించకుండా నిరసన చేపడుతున్నాం. ఇప్పటికైనా భాషా పండితులకు పదోన్నతులు కల్పించకుంటే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.


జీవోలు అమలు చేయకపోవడంతోనే..

- కిరణ్‌ మహీ, హిందీ పండితులు, భూపాలపల్లి ఉన్నత పాఠశాల

మూడు దశబ్దాలుగా భాషా పండితులు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని, సీఎం కేసీఆర్‌ 2017లో నిర్వహించిన తెలుగు ప్రపంచ మహాసభల్లో భాషా పండితుల పోస్టులు ఉన్నతీకరించి, స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయిని పెంచి, సర్వీస్‌ రూల్స్‌ జీవోలు జారీ చేశారు. అధికారులు ఆ జీవోలు అమలు చేయకపోవటంతోనే నేడు నష్టపోతున్నాం.


సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

- రఘు, పీఈటీ, ఉన్నత పాఠశాల, రేగొండ

ఐదేళ్ల క్రితమే తెలుగు ప్రపంచ మహాసభల్లో పీఈటీలకు పదోన్నతి కల్పిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ నేటికీ హామీ నీటి మూటలుగానే మిగిలిపోయింది. సీఎం ఇచ్చిన హామీ అమలుకాకుంటే తాము ఇంకా ఎవరి వద్దకు వెళ్లాలి. కోర్టు స్టేను వెకేట్‌ చేయించి, కోర్టు తీర్పుకు లోబడి పీడీలుగా పదోన్నతి కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని