logo

కొనసాగుతున్న ‘ప్రజాప్రస్థానం’

రాజన్న పాలన తేవడానికి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టినట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Updated : 04 Feb 2023 06:47 IST

పాదయాత్రలో వాహనదారులతో మాట్లాడుతున్న షర్మిల

పర్వతగిరి, నెక్కొండ, న్యూస్‌టుడే: రాజన్న పాలన తేవడానికి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టినట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం నెక్కొండ, పర్వతగిరి మండలాల్లోని చింతనెక్కొండ క్రాస్‌రోడ్డు, సాయిరెడ్డిపల్లి, ఏబీ తండా, దౌలత్‌నగర్‌, పర్వతగిరి, దేవిలాల్‌ తండా, గుంటూరుపల్లి, తురుకల సోమారం, జమాల్‌పురం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగించి చౌటపల్లి గ్రామ శివారులోని జానకిపురానికి శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు.  దౌలత్‌నగర్‌ గ్రామానికి చెందిన బత్తిని సాంబయ్య షర్మిల వద్దకు వెళ్లి మీ నాన్న రాజశేఖర్‌రెడ్డి వచ్చినట్లుందమ్మా అంటూ ఆయన మాట్లాడటంతో ఆప్యాయంగా ఆయనను దగ్గరకు తీసుకొని రాజన్నపాలనకు అందరు సహకరించాలన్నారు.  
మంత్రి దయాకర్‌, ఎమ్మెల్యే రమేష్‌పై విమర్శలు: పర్వతగిరిలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌పై విమర్శలు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కమీషన్లు తీసుకుంటూ ఏ-1 కాంట్రాక్టర్‌గా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరిగిన భారీ కుంభకోణంపై సొంతపార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడమే ఆయన అవినీతికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భూమినే కబ్జా చేయడానికి యత్నించడంతో పాటు చివరికి గుట్టలను కూడా మాయం చేస్తున్నారని పత్రికలో చవినట్లు పేర్కొన్నారు. మంత్రి దయాకర్‌రావు స్వగ్రామంలో కనీసం 24 గంటల ఆసుపత్రి, డిగ్రీ కళాశాలలు లేకపోవడం విడ్డూరమన్నారు.  బిల్లులు ఇప్పించాలని సర్పంచులు మంత్రిని అడిగితే.. ఖాళీగా ఉన్న బీరు, బ్రాందీ సీసాలు అమ్మకొని పంచాయతీలను నడుపుకోవాలనడం వింతగా ఉందన్నారు.  

ఫ్లెక్సీల చించివేత: పాదయాత్రలో భాగంగా తురుకల సోమారం గ్రామంలో సల్ప ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌పై చేసిన విమర్శలకు నిరసనగా షర్మిల ఫ్లెక్సీలను కొందరు చించివేశారు. అప్రమత్తమైన పోలీసులు వారితో మాట్లాడటంతో ఎలాంటి సమస్యలు లేకుండా చౌటపల్లి గ్రామ శివారులోని జానకిపూరంలో రాత్రి బస చేసే క్యాంపునకు వైతెపా శ్రేణులు పాదయాత్రగా తరలివెళ్లాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు