logo

కొంతైౖనా ‘కరుణించారు..’

రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈసారి  ఉమ్మడి వరంగల్‌కు తగిన ప్రాధాన్యం లభించింది. జిల్లాకు కొత్త లైన్లు, పరిశ్రమలు, ఇతరాత్ర అవసరాల కోసం  కొంత వరకు కేటాయింపులు జరిగాయి.

Published : 04 Feb 2023 06:08 IST

ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా..

కాజీపేట, డోర్నకల్‌, న్యూస్‌టుడే: రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈసారి  ఉమ్మడి వరంగల్‌కు తగిన ప్రాధాన్యం లభించింది. జిల్లాకు కొత్త లైన్లు, పరిశ్రమలు, ఇతరాత్ర అవసరాల కోసం  కొంత వరకు కేటాయింపులు జరిగాయి. పార్లమెంటులో ఈ నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన 2023-24 బడ్జెట్‌లో రైల్వే పరంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాత ప్రాజెక్టులకు స్పల్పంగానైనా  నిధులు ఇచ్చారు. రైల్వేశాఖ.. కేటాయింపులపై శుక్రవారం వివరణాత్మక ప్రతి (పింక్‌ బుక్‌)ని వెలువరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..  


పీవోహెచ్‌కు నిధులు

రైల్వే బడ్జెట్‌లో కాజీపేటను ఆధారంగా తీసుకుని కేటాయింపులు చేశారు. ముఖ్యంగా ఆయోధ్యపురం వద్ద నిర్మించ తలపెట్టిన వ్యాగన్‌, పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ షెడ్‌కు రూ.160 కోట్లు కేటాయించడం స్థానికంగా ఆనందం వెళ్లి విరుస్తోంది. సుమారు రూ.వెయ్యి కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు గత మూడు బడ్జెట్‌ల నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి.. దీనికి ఎకరంన్నర స్థల సమస్య వెంటాడుతోంది. పీఓహెచ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో 150 ఎకరాల ప్రైవేటు స్థలానికి ముఖ ద్వారం వద్ద ఉన్న ఎకరంన్నర భూమి కావాలని కేంద్రం అడుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది.


ఇదీ పరిస్థితి..

* ఈ రెండు మార్గాలల్లో కొత్త రైల్వే లైను ఏర్పడితే ఉమ్మడి జిల్లా మీదుగా రైళ్ల రాకపోకల సంఖ్య పెరుగుతుంది. ప్రయాణ దూరం కూడా కలిసివస్తోంది. ఈసారి కూడా ఈ రైల్వే లైన్లకు స్వల్పంగానైనా కేటాయింపులు చేశారు.

* 2012-13 రైల్వే బడ్జెట్‌లో భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను మంజూరైంది. దీని పొడవు 151 కిలోమీటర్లు. మొదట్లో దీని అంచనా వ్యయం రూ.1445 కోట్లు కాగా ఇప్పుడు ఇది రూ.2153.83 కోట్లకు చేరింది.

* 2013-14లో మణుగూరు-రామగుండం రైల్వే లైను ప్రతిపాదించారు. దీని పొడవు 200 కిలోమీటర్లు. అప్పట్లో దీని వ్యయం రూ.1112 కోట్లు కాగా ప్రస్తుతం రూ.2911 కోట్లు.


మూడో లైను ముందుకు సాగేనా..

* 2012-13 రైల్వే బడ్జెట్‌లో 220 కిలోమీటర్ల పొడవైన కాజీపేట-విజయవాడ మూడో లైనుకు రూ.1953 కోట్లు కేటాయించారు. విజయవాడ-చెరువు మాధవరం మధ్య 19.2 కిలోమీటర్ల మేరకు పని పూర్తయింది. మిగిలిన పని పురోగతిలో ఉంది.

* 2015-16 రైల్వే బడ్జెట్‌లో 201 కిలోమీటర్ల పొడవైనా కాజీపేట-బల్లార్షా 3వ రైల్వే లైనుకు రూ.2063 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రాఘవపురం-పొత్కపల్లి, వీరూర్‌-మాణిక్‌గర్‌ మధ్య 50 కిలోమీటర్ల మేరకు త్రిపుల్‌ పని విద్యుద్దీకరణతో సహా పూర్తి చేశారు. మిగతా పనిని ఇప్పుడు వేగవంతం చేశారు.

* మూడో  లైను పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడదు. ఒక వైపు గూడ్స్‌ రైళ్లు, మరోవైపు ప్రయాణికుల బండ్లు యథావిధిగా నడుస్తాయి. ప్రస్తుతం ట్రాక్‌ సరిపోక అప్పుడప్పుడు ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి గూడ్స్‌ రైళ్లను నడుపుతున్నారు.


ఫ్రైట్‌ ట్రేయిన్‌ ఎగ్జామినేషన్‌ సదుపాయం

డోర్నకల్‌ జంక్షన్‌లో ఇటీవల రూ.8.80 కోట్లతో సిక్‌ లైను షెడ్డు నెలకొల్పారు. 2015-16 రైల్వే బడ్జెట్‌లో ఇది రూ.7,39,62,000 అంచనాతో మంజూరైంది. ఇప్పుడు రూ.8,80,66,366.30కు చేరింది. అప్పట్లో రూ.25 లక్షలు విడుదల కాగా డోర్నకల్‌లో చిన్నపాటి (మినీ) ఫ్రైట్‌ ట్రెయిన్‌ ఎగ్జామినేషన్‌ వ్యవస్థ నెలకొల్పారు. 25 మంది సిబ్బందిని కేటాయించారు. ఇందులో వ్యాగన్ల మరమ్మతుల కోసం ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. దీనిని సీ అండ్‌ డబ్ల్యూ మెకానికల్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. తాజా బడ్జెట్‌లో దీనిని ఉన్నతీకరించడానికి రూ.71.49 లక్షలు మంజూరు కావడం విశేషం. వీటితో ఇందులో రోటీన్‌ ఓవర్‌ హాలింగ్‌ విభాగం ఏర్పాటవుతుంది.

* కాజీపేటలో నిర్మించిన పిట్‌లైన్‌లో 24 కోచ్‌లను నిలిపే విధంగా సామర్థ్యం పెంపుకు ప్రతిపాదనలు చేశారు.

* కాజీపేట చుట్టూ ఉన్న రైల్వే క్యాబిన్‌లు, రైల్వే క్వార్టర్స్‌ నిర్మాణం కోసం కూడా సర్వే చేసి అవసరం ఉన్న వాటిని ప్రతిపాదించడానికి నిధులు కేటాయించారు. పాతపడిన క్యాబిన్‌లను పునఃనిర్మాణం చేయాలని సూచించారు.


వీటి ప్రస్తావన కూడా ఉంది

* కాజీపేట డీజిల్‌ లోకో షెడ్‌ సామర్థ్యం పెంపునకు రూ.6.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇక్కడ లోకోల సంఖ్య 100 నుంచి 150కు పెరుగుతుంది.

* కాజీపేట ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌ సామర్థ్యం పెంపునకు రూ.1.70 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇక్కడ లోకోల సంఖ్య 125 నుంచి 175కు చేరుతుంది.

* కాజీపేట-విజయవాడ, కాజీపేట-బల్లార్షా, సికింద్రాబాద్‌-కాజీపేట మధ్య ఆర్‌వోబీల నిర్మాణానికి నిధుల కేటాయించారు.

* కాజీపేట-విజయవాడ, కాజీపేట-బల్లార్షా మధ్య లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌ నిర్వహణకు నిధులు మంజూరు చేశారు.


బైపాసు..

విజయవాడ, రేణిగుంట్ల, వాడీ, గూటీ బైపాసు రైల్వే లైన్లు కలుపుకొని కాజీపేట(10.65 కి.మి) బైపాసు రైల్వే లైనుకు రూ.383.12 కోట్లు ఇచ్చారు.


* డోర్నకల్‌   రూ.71.49 లక్షలు

* కొత్త రైల్వే లైన్లు కేటాయింపు (రూ.కోట్లలో)

* భద్రాచలం-కొవ్వూరు 20

* మణుగూరు-రామగుండం 10

* 3వ లైను (రూ.కోట్లలో)

* కాజీపేట-విజయవాడ 337.52

* కాజీపేట-బల్లార్షా 450.86


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు