logo

ఎమ్మెల్యే సారూ.. పరిష్కారం చూపరూ!

శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేలా ‘ఈనాడు’ పిలుపునివ్వగా ప్రజల నుంచి స్పందన లభించింది..

Published : 04 Feb 2023 06:32 IST

నియోజకవర్గ సమస్యలపై  ప్రస్తావన

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి- న్యూస్‌టుడే, మహదేవపూర్‌: శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేలా ‘ఈనాడు’ పిలుపునివ్వగా ప్రజల నుంచి స్పందన లభించింది.. దీర్ఘకాలిక సమస్యలు, మౌలిక సదుపాయాలు, సాగు, విద్య, వైద్యం.. తదితర సమస్యలను  చరవాణికి చిత్ర సహితంగా పంపించారు. ఆయా సమస్యలను భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లగా.. వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని, శాసనసభ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు.


భూపాలపల్లిలో విన్నపాలిలా..

* కరెంటు కోతలతో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. వ్యవసాయానికి 24 గంటలు ఇవ్వాలి. అలాగే రూ.లక్ష వరకున్న వ్యవసాయ రుణాలను మాఫి చేయాలి.  -చర్లపల్లి వెంకటేశ్వర్లుగౌడ్‌, భూపాలపల్లి

* చిట్యాల సీˆహెచ్‌సీలో వైద్యుల కొరత వేధిస్తోంది. 50 పడకల ఆసుపత్రి భవనంలో సౌకర్యాలున్నా మెరుగైన వైద్యసేవలు ఈ ప్రాంత ప్రజలకు అందడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి. -కోడెల భద్రయ్య, చిట్యాల


గర్మిళ్లపల్లి-ఒడేడు మధ్య అసంపూర్తిగా వంతెన

* టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఒడేడు మధ్య మానేరు వాగుపై వంతెన పనులు ఆరేళ్లుగా కొనసాగుతున్నాయి. అవతలి వైపు వెళ్లాలంటే కాల్వశ్రీరాంపూర్‌ మీదుగా సుమారు 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. వంతెన పూర్తి చేయాలి

నూకల శ్రీకాంత్‌, ఆరెపల్లి, టేకుమట్ల మండలం


* శాయంపేట ప్రధాన రహదారి నుంచి శివారు వరకు కిలోమీటరు మేర రహదారి దెబ్బతింది. రోడ్డు విస్తరణ మధ్యలోనే ఆగిపోయింది. పలువురు ఇళ్లను కూడా కోల్పోయారు. నాలుగేళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వలపదాసి వెంకటరమణ, శాయంపేట


* రేగొండ మండలం కనపర్తి నుంచి పరకాల వెళ్లే రహదారి అధ్వానంగా మారింది.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం.

మండల యుగంధర్‌గౌడ్‌


మంథనివాసుల గోడు ఇదీ..

* ఐదు మండలాల పరిధిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే భారీ నష్టం వాటిల్లుతోంది.. మహాముత్తారం, పలిమెల మండలాలకు అగ్నిమాపక వాహనం సకాలంలో చేరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని మాపక వాహనం ఏర్పాటు చేయాలి.?

బొడ్డు సుధాకర్‌, కాటారం.


ప్రాంతంలో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహదేవపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. ప్రాజెక్టులు, అటవీ ప్రాంతం, భూ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాలు కావడంతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైతే ప్రజలకు మేలు జరుగుతుంది. 

సింగు లక్ష్మీనారయణ, కాటారం, వెంకటేష్‌, మహదేవపూర్‌


మహాముత్తారం, పలిమెలలోని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. సింగంపల్లి నుంచి కనుకునూర్‌ వరకు కాలినడకన వెళ్తున్నాం.. మారుమూల పల్లెలకు బస్సులు నడపించేలా చర్యలు తీసుకోవాలి.

రాజ్‌కుమార్‌, సింగంపల్లి గ్రామ ప్రజలు


ఐదు మండలాలకు సాగు, తాగు నీరు అందించే చిన్న కాళేశ్వర ఎత్తిపోతల పథకం, ఆయా మండలాల పరిధిలోని పలిమెల, కుదురుపల్లి, దామెరకుంట పథకాలు పూర్తి కాలేదు. పథకాలు పూర్తయితే వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది..

పీక కిరణ్‌, కాటారం


* ఐదు మండలాలకు వైద్య సేవలు అందిస్తున్న మహదేవపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో మెరుగైన వైద్యం అందడం లేదు. ప్రసూతి సేవలను మెరుగుపర్చాలి.

పి.బాపు, మహదేవపూర్‌


*  కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో మహదేవపూర్‌ మండలంలోని పలు గ్రామాలు, కాటారంలో దామెరకుంట, విలసాగర్‌, ఆరెంద, వెంకటపూర్‌, పలిమెల మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయి. పునరావాస ప్యాకేజీ అందించాలి..

జక్కు శ్రావణ్‌, కాటారం, మంథని సుమంతి గంగపురి. జనగామ ప్రభాకర్‌, పలిమెల.


* పలిమెలలో పాలన సాగాలి. కొత్త మండలంగా ఏర్పాటైనా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు జరగలేదు. స్థానికంగా అధికారులు ఉండి పరిపాలన సాగించడం లేదు. 

భాడిషా భాస్కర్‌, పలిమెల, కిరణ్‌, మహాముత్తారం.


కాళేశ్వర క్షేత్రం అభివృద్ధి, గోదావరి రహదారి విస్తరణ, జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలి.

మానెం మహేష్‌, ఎల్‌.రవి కాళేశ్వరం.


నిధులు మంజూరయ్యేలా చూస్తాను
గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే భూపాలపల్లి

‘ఈనాడు’ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా.. సభ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తాను. వైద్యుల నియామకం జరుగుతోంది. చిట్యాల సీˆహెచ్‌సీˆకి కేటాయించే అవకాశం ఉంది. శాయంపేట రహదారి విద్యుత్తు స్తంభాలు తరలించాల్సి ఉంది. దానికి డబ్బులు కూడా చెల్లించాం.. త్వరలోనే పనులు పూర్తవుతాయి. కనపర్తి రహదారి సైతం మరమ్మతులు చేయిస్తాం. మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తాను.


పలుమార్లు సభ దృష్టికి తీసుకెళ్లాను..  - డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే, మంథని

కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుపై బాధితులకు న్యాయం చేయాలని, మెరుగైన పరిహారం అందించాలని పలుమార్లు సభ దృష్టికి తీసుకెళ్లాం.. మరోమారు ప్రత్యేకంగా మాట్లాడుతాను. రెవెన్యూ డివిజన్‌, అగ్నిమాపక యంత్రం ఈ ప్రాంతం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తాం. ఆసుపత్రి, పాఠశాలలో సిబ్బందిని నియమించాలని కోరుతాం. గోదావరి ముంపుతో ఉన్న గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత ప్రజల  సమస్యలను విన్నవిస్తాం. రహదారుల మరమ్మతులు, అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాట్లాడుతాం.. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమస్యలపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని ఆశిస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని