ఏలికలూ.. సమస్యలపై గళమెత్తండి!
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి అని ‘ఈనాడు’ పిలుపునిచ్చింది.
న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్, పరకాల
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి అని ‘ఈనాడు’ పిలుపునిచ్చింది. హనుమకొండ జిల్లా పరిధిలోని వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల నుంచి చాలా మంది స్పందించారు. చరవాణి, వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేశారు. చిత్రాలూ పంపారు. వాటిని ఏలికలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, పరిష్కారమార్గం చూపితే ప్రజాప్రయోజనం చేకూరుతుంది.
వరంగల్ పశ్చిమ
కేయూలో అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయాలి
-డాక్టర్, శ్రీధర్‌కుమార్, కేయూ ఒప్పంద అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు
కాకతీయ విశ్వవిద్యాలయంలో సుమారు 400 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 91 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా బోధన కుంటుపడుతోంది. పోస్టులు భర్తీ చేయాలి. వర్సిటీలోని బోధన, బోధనేతర ఉద్యోగుల వేతనాలు, వివిధ అభివృద్ధి పనులకు గానూ ఏటా రూ.250 కోట్ల ఖర్చు అవుతోంది. ప్రభుత్వం కేవలం రూ.120 కోట్లు ఇస్తోంది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 15 కొత్త కోర్సులు వచ్చాయి. వీటికి సరిపడా పోస్టులు మంజూరు కాలేదు. 20 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ శాసనసభలో చర్చించి వర్సిటీకి నిధులు తేవడంతో పాటు, ఉద్యోగాల భర్తీకి కృషి చేయాలి.
ప్రయాణ ప్రాంగణాన్ని విస్తరించాలి
-అంకతి విజయ్‌కుమార్, హనుమకొండ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ బస్టాండ్ చాలా కీలకం. ఇక్కడి నుంచి నిత్యం 90వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక, సెలవు దినాల్లో వీరి సంఖ్య రెండితలు పెరుగుతుంది. సుమారు 600 బస్సులు వచ్చిపోతుంటాయి. ప్రయాణికులకు సరిపడా ప్లాట్‌ఫారాలు లేవు. ఇరుకుగా ఉండటంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బస్టాండు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు మొదలుకాలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి.. బస్టాండ్ విస్తరణకు నిధులు మంజూరు చేయించి.. పనులు ప్రారంభించేలా కృషి చేయాలి.
నత్తనడకన కళాక్షేత్రం పనులు
- గట్టు శ్రీకాంత్, గోకుల్‌నగర్
హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచినది వరంగల్ మహానగరం. ఇక్కడి కవులు, కళాకారులకు వేదికగా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అత్యాధునిక వసతులతో కాళోజీ కళాక్షేత్రం, ఆడిటోరియం నిర్మించేందుకు 2016లో పనులు ప్రారంభించారు. కానీ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఆరేళ్లు గడిచినా పూర్తి కాలేదు. కళారంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ హయాంలో కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తిగాకపోవడం బాధకరం. స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు: -దయాకర్, నాగేంద్రనగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. గుడిసెవాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే పూర్తయిన చోట పేదలకు అందజేయాలి.
కేయూ వీసీతో మాట్లాడతా..
-దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా. కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులు తీసుకొస్తా. ఆదివారం కేయూ వీసీతో సమావేశం ఏర్పాటు చేశా. వివరాలన్నీ తెలుసుకుంటా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా.
* వర్ధన్నపేట నియోజకవర్గంలోని చాలా గ్రామాలు జీడబ్ల్యూఎంసీలో విలీనం అయ్యాయి. రైతులు భూ రికార్డుల కోసం సాదాబైనామ కింద దరఖాస్తు చేసి రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి.
బాలు, హసన్‌పర్తి
వర్ధన్నపేట
* నర్సంపేట రోడ్డు నుంచి ఎనుమాముల వెళ్లే వంద ఫీట్ల దారిని ఇటీవల నిర్మించారు. కానీ రోడ్డు మధ్య డివైడర్, ఇరువైపులా మురుగు కాల్వలు నిర్మించలేదు. వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించండి.
వి.ఇంద్రసేన, మణికంఠ కాలనీ
* ప్రస్తుతం చాలా మందికి ఫిజియోథెరపీ అవసరం ఉంటోంది. ప్రభుత్వం గుర్తించి ప్రతి పీహెచ్‌సీకి ఒక ఫిజియోథెరపిస్టు పోస్టును మంజూరు చేయాలి. ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటు చేయాలి.
డాక్టర్ సురేశ్ ఆకారపు, హనుమకొండ
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. : అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
విలీన గ్రామాల్లో సాదాబైనాల సమస్య సీఎం పరిశీలనలో ఉంది. త్వరలో పరిష్కారం అవుతుంది. మరో సారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఫిజియోథెరపీ పోస్టుల గురించి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తా. రోడ్లు, ఇతర నిర్మాణాలకు ఇటీవల నిధులు మంజూరయ్యాయి. తర్వలో అనుమతులు తీసుకొని పనులను ప్రారంభిస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
వర్ధన్నపేట, న్యూస్‌టుడే
పరకాల
కోనాయమాకుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి
- టి.బ్రహ్మచారి, గీసుకొండ
గీసుకొండతో పాటు వివిధ మండలాలకు సాగు, తాగునీటిని అందించే కొనాయమాకుల ఎత్తిపోతల పథకం కొన్నేళ్ల నుంచి పూర్తి కాలేదు. ఆ ఎత్తిపోతలపై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పథకాన్ని పూర్తి చేయాలి. అర్హులకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలి.
అక్కంపేటపై అశ్రద్ధ తగదు: - పెండ్లి రమేష్, అక్కంపేట
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దశ, దిశగా పేరొందిన ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటపై అశ్రద్ధ కనబరుస్తున్నారు. రెవెన్యూ గ్రామం చేయకపోవడమేగాక ఏ ఒక్కరికి రెండు పడక గదుల ఇళ్లను ఇవ్వలేదు. ఆరోగ్య కేంద్రానికి పక్కా భవనం, పశు వైద్య కేంద్రం లేదు. ఏ ఒక్కరికీ దళిత బంధు పథకం అందలేదు. మినీ మేడారం గా పిలిచే అగ్రంపహాడ్‌ను అభివృద్ధి చేయలేదు. అక్కంపేట, అగ్రంపహాడ్‌లను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలి.
కొత్త మండలాలపై దృష్టి పెట్టాలి: - వేల్పుల రాజ్‌కుమార్, దామెర
దామెర, నడికూడ కొత్తగా మండలాలుగా ఏర్పడ్డాయి. ఏడేళ్లు గడుస్తున్నా దామెరలో ఇప్పటి వరకు ఎంపీడీవో, పోలీసుస్టేషన్లకు నూతన భవనాలు లేవు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించాలి. ఉన్నత విద్య అందేలా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను, హాస్టల్‌ను ప్రారంభించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!
-
Sports News
MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి