logo

‘ఈనాడు’ తోడు.. దివ్యాంగులకు గూడు

విధి వెంటాడి.. జీవితాలు అంధకారమై.. చేయూతనిచ్చే వారు కరవైన దివ్యాంగ దంపతులకు ‘ఈనాడు’ అండగా నిలిచింది.. వారి దీన స్థితిపై ప్రచురితమైన కథనంతో దాతలు స్పందించి అండగా నిలిచారు.

Published : 04 Feb 2023 06:43 IST

కొత్త ఇంట్లో దివ్యాంగులకు గృహోపకరణాలు, నిత్యావసరాలు అందజేస్తున్న దాతలు

రఘునాథపల్లి, న్యూస్‌టుడే : విధి వెంటాడి.. జీవితాలు అంధకారమై.. చేయూతనిచ్చే వారు కరవైన దివ్యాంగ దంపతులకు ‘ఈనాడు’ అండగా నిలిచింది.. వారి దీన స్థితిపై ప్రచురితమైన కథనంతో దాతలు స్పందించి అండగా నిలిచారు. వివరాలు ఇలా.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో పుట్టుకతోనే దివ్యాంగులైన వాతాల యాదగిరి అనిత దంపతులది దీన గాథ.. పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడిపోయాయి. దీనికితోడు కుటుంబ సభ్యులను కోల్పోయారు. మొక్కవోని ధైర్యంతో విద్యాభ్యాసం చేశారు. మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు. పండంటి బిడ్డ జన్మించింది. అన్యోన్యంగా జీవిస్తున్న వీరిని విధి వెంటాడింది. కనీసం నివసించేందుకు ఇళ్లు లేక, జీవించేందుకు ఆధారం లేక కొట్టుమిట్టాడుతున్నారు. వీరి దైన్య స్థితిపై ‘ఈనాడు’లో గత నవంబర్‌ 18న ‘జీవితాల్లో చీకటి.. స్పందిస్తే వెలుగులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. హైదరాబాద్‌ బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌, హోప్‌ ఫర్‌ స్పందన సంస్థలు స్పందించాయి. వారికి రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణంతోపాటు రూ.1.30 లక్షలతో ఉపాధి కోసం కిరాణం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. డిసెంబర్‌ 11న హోప్‌ఫర్‌ స్పందన ప్రతినిధులైన రుస్తుం భాస్కర్‌, జ్యోతిర్మయి దంపతుల సౌజన్యంతో బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు అరికపూడి రఘు ఇంటి నిర్మాణానికి సరిపడా సామగ్రిని తీసుకొచ్చి 33 రోజుల్లోనే ఇంటిని నిర్మింపజేశారు. శుక్రవారం వైభవంగా గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహాన్ని రఘుతోపాటు ఫౌండేషన్‌ కార్యనిర్వాక అధ్యక్షుడు జీవరత్నంతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్‌ శంకరపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి బరాది విశ్వమోహన్‌ గృహ ప్రవేశం సందర్భంగా దివ్యాంగ దంపతులకు, వారి చిన్నారి కూతురుకు వస్త్రాలను అందజేశారు. గృహోపకరణాలు, ఆరు నెలలకు సరిపడా నిత్యవసరాలను అందజేశారు. వారం రోజుల్లోనే కిరాణం దుకాణాన్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని రఘు, జీవరత్నం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. చీకటిమయమైన జీవితం వెలుగులోకి రావడానికి కారణమైన ‘ఈనాడు’ యాజమాన్యానికి, బీడీఎల్‌, హోప్‌ఫర్‌ స్పందన సంస్థకు దివ్యాంగ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ దివ్యాంగుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల సమ్మయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు