logo

పొదుపు మంత్రం పాటిద్దాం!

సోమవారం నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నల్లా నీళ్లపైన ఆధారపడిన ప్రజలు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే.

Updated : 05 Feb 2023 06:26 IST

రేపటి నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిపివేత

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌: సోమవారం నుంచి మూడు రోజులు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నల్లా నీళ్లపైన ఆధారపడిన ప్రజలు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆదివారం సరఫరా చేసే తాగునీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంతగా సమస్య నుంచి బయటపడతారు. వృథా చేయకుండా కేవలం తాగేందుకు, వంటకు ఉపయోగించుకోవాలి. నగరంలోని 50 డివిజన్లలో 7.5 లక్షల మందికి ఎదురు కానున్న తాగునీటి సమస్య నుంచి గట్టెక్కాలంటే నీటి పొదుపు తప్పనిసరి అని గుర్తించాలి.
ధర్మసాగర్‌ చెరువు నుంచి వరంగల్‌ నగరానికి వచ్చే 2100 ఎంఎం డయా ప్రధాన పైపులైన్‌ పైన కొత్తగా మూడు బట్టర్‌ ఫ్లై వాల్వ్‌లు ఏర్పాటు చేశారు. ఐదారేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రెండు పాత వాల్వ్‌లు దెబ్బతిన్నాయి. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా కొత్తగా మూడు బట్టర్‌ ఫ్లై వాల్వ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఈఎన్‌సీ సూచించారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ పబ్లిక్‌హెల్త్‌ ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పనులు ప్రారంభం కానున్నాయి. ధర్మసాగర్‌ నుంచి వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట తాగునీటి శుద్ధీకరణ కేంద్రాలకు రా వాటర్‌ విడుదల పూర్తిగా నిలిచిపోనుంది. మూడు ఫిల్టర్‌బెడ్లలో నీటిశుద్దీకరణ ఆగిపోనుంది. వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్లలో 50 డివిజన్లు, సుమారు 7.50 లక్షల మందికి సోమ, మంగళ, బుధవారాల్లో తాగునీటి సరఫరా ఉండదు. కేవలం అండర్‌ రైల్వేగేటు జోన్‌ పరిధిలో యధావిధిగా నీటి సరఫరా ఉంటుందని గ్రేటర్‌ వరంగల్‌ నీటి సరఫరా విభాగం ఈఈ బీఎల్‌.శ్రీనివాస్‌రావు తెలిపారు. మూడు రోజుల అంతరాయానికి నగర ప్రజలు సహకరించాలని కోరారు.


ఇలా చేయండి..

*  ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా ఉంటుంది.  
నల్లా నీళ్లను ప్లాస్టిక్‌ డ్రమ్ములు, పెద్ద గిన్నెలు, బిందెల్లో అదనంగా నిల్వ చేసుకోవాలి.
* దుమ్ము ధూళి పడకుండా వీటిపైన మూతలు లేదా వస్త్రం కప్పాలి.
* కుళాయి వాటర్‌ సంప్‌లుంటే నిల్వ చేసుకోవాలి.
తాగేందుకు, వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలి.
* దుస్తులు ఉతకడం, మొక్కలు, చెట్లకు నీళ్లు పట్టడానికి ఇతర వనరులను వినియోగించుకోవాలి.
* స్నానం, మరుగుదొడ్ల వినియోగం, ఇతర అవసరాలకు బోర్‌, చేతి పంపు నీళ్లను వాడుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని